
Nitin Gadkari: సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి : నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
ఆయనతో పాటు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సోమవారం ఉదయం 10:20 గంటలకు నితిన్ గడ్కరీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు.
అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి రూ.3,694.42 కోట్ల వ్యయంతో నిర్మించిన 115.39 కిలోమీటర్ల పొడవైన ఐదు జాతీయ రహదారులకు నితిన్ గడ్కరీ ప్రారంభం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క,ఎంపీ గోడం నగేష్,అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
వివరాలు
తెలంగాణకు మోదీ సర్కార్ 12 లక్షల కోట్లు
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్, గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు ప్రయాణించాలంటే ఉదయం బయలుదేరితే సాయంత్రం లేదా రాత్రికి మాత్రమే చేరుకునే పరిస్థితి ఉండేదని చెప్పారు.
కానీ ఎన్డీయే ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇదే ప్రయాణం కొన్ని గంటల్లోనే పూర్తి చేసేలా రహదారి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మొత్తం 5,100 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించారని వెల్లడించారు.
నితిన్ గడ్కరీ చొరవతో ఈ అభివృద్ధి మరింత వేగంగా జరిగిందని తెలిపారు. దేశంలో జాతీయ రహదారుల కోసం రూ.1.25 లక్షల కోట్లను కేటాయించిందని చెప్పారు.
అంతేకాకుండా రైల్వే అభివృద్ధికి కూడా రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించారు.
వివరాలు
నేటి సాయంత్రం హైదరాబాద్‌లో బహిరంగ సభ
తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించి అభివృద్ధికి తోడ్పడాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన సూచించారు.
మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి కోసం మొత్తం రూ.12 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు.
కాగజ్‌నగర్ పర్యటనను ముగించుకున్న తర్వాత, మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 వరకు నితిన్ గడ్కరీ హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు.
అదే విధంగా సాయంత్రం 5.30 గంటలకు అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను కూడా ప్రారంభించనున్నారు.
వివరాలు
సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారి
ఈ కార్యక్రమాల అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ సభ వేదిక నుంచే కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డి కలిసి రూ.2,628.43 కోట్ల వ్యయంతో నిర్మించిన 173.14 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారులకు ప్రారంభం చేస్తారు.
ఇవి కాకుండా, పలు వంతెనల నిర్మాణాలకు, రహదారుల విస్తరణ పనులకు కూడా కేంద్ర మంత్రులు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు ఒక కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
వివరాలు
నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు కారిడార్
"నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు కారిడార్‌ను ప్రారంభించాం.ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత బలపడుతుంది," అని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ,భద్రాచలం,బాసర, మేడారం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
అదే సమయంలో, జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఉన్న హైవేను విస్తరించేందుకు సంబంధించిన పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు.