LOADING...
Adoni: మహిళల వేషాల్లో పురుషులు.. రతీమన్మథుల పూజలతో హోలీ వైభవం.. అదే ఆ ఊరి ప్రత్యేకత 
అదే ఆ ఊరి ప్రత్యేకత

Adoni: మహిళల వేషాల్లో పురుషులు.. రతీమన్మథుల పూజలతో హోలీ వైభవం.. అదే ఆ ఊరి ప్రత్యేకత 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆ పల్లెల్లో హోలీ పండుగకు ప్రత్యేకమైన శోభ ఉంటుంది. పురుషులు మహిళల వేషాలు ధరించి ఊరేగింపుల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. రతీమన్మథుల విగ్రహాలను ప్రతిష్ఠించి గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఎక్కడ ఉన్నా ఊరువాళ్లంతా ఈ సంబరాల కోసం స్వగ్రామానికి చేరుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఆదోని మండలంలోని సంతేకుడ్లూరు గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతోంది. గ్రామంలో ఐదు రోజులపాటు హోలీ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. రతీమన్మథుల విగ్రహాలను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది.

వివరాలు 

గ్రామంలో విస్తృత ఏర్పాట్లు

ఈ నెల 4, 5 తేదీల్లో ప్రధాన ఉత్సవాల కోసం గ్రామంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. 4వ తేదీన మహిళల వేషధారణలు, రథోత్సవం నిర్వహించనున్నారు. 5వ తేదీన కామదహనం, శస్త్ర విన్యాసాలు, కుంభోత్సవం, అన్నదానం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. చిన్నారులు ఏనుగు అంబారీలో ఆసీనులై ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రైతుల కోసం ప్రత్యేకంగా ఎద్దుల సంతను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ పరికరాలతో పాటు ఎద్దుల కొనుగోలు-అమ్మకాలు జరుగుతాయి. దశాబ్దాలుగా గ్రామస్థులు ఐక్యంగా, సంప్రదాయరీతిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement