
Telangana: రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం
ఈ వార్తాకథనం ఏంటి
ఆధార్ నమూనాలో రైతులకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా,రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రాజెక్టు సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానుంది.
ప్రాథమిక దశలో వ్యవసాయ శాఖ కార్యాలయాల్లోనే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
త్వరలో ఈ సేవను'మీ సేవ'కేంద్రాల ద్వారా కూడా రైతులు పొందవచ్చు.ఈ విశిష్ట గుర్తింపు కార్డును, ఆధార్ నంబర్‌తో అనుసంధానించిన పట్టాదారు పాస్‌బుక్‌లోని భూయజమాన్య సమాచారం ఆధారంగా జారీ చేస్తారు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక వసతుల కల్పన వంటి పథకాలు ఉన్నా, సరైన గణాంకాలు, ధ్రువీకరణలేకపోవడంతో రైతులకు సకాలంలో ప్రయోజనాలు అందడం లేదని కేంద్రం గుర్తించింది.
వివరాలు
'అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ' పేరుతో అమలు
ప్రస్తుతం రాష్ట్రాల నుండి భూములు, పంటల వివరాలు మాత్రమే కేంద్రానికి అందుతున్నాయి.
కానీ వ్యక్తిగత రైతుల వారీగా వివరాలు అందడం లేదు.ఇది వ్యవసాయ శాఖలో డిజిటలీకరణకు ఆటంకంగా మారుతోంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు నెంబరు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు కోసం కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి.
తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభిస్తున్నా, సోమవారం నుండి 'అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ' పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం మండల వ్యవసాయ అధికారి (MAO)లు, వ్యవసాయ విస్తరణాధికారి (AEO)లకు తగిన శిక్షణను కూడా అందించారు.
వివరాలు
పరీక్షించిన తర్వాత గుర్తింపు నెంబరు
ఈ గుర్తింపు నెంబరు కోసం రైతులు తమ భూయజమాన్య పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నంబరుతో కలిసి MAO లేదా AEOల వద్ద నమోదు చేసుకోవాలి.
ఆ తర్వాత రైతు ఫోన్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. దాన్ని ధృవీకరించిన తర్వాతే ప్రత్యేక గుర్తింపు నెంబరు జారీ అవుతుంది.
ఈ నెంబరును కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు.
పీఎం కిసాన్ పథకంలో తదుపరి విడత నిధుల విడుదల కోసం ఇదే గుర్తింపు నెంబరును ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది.
వివరాలు
రాష్ట్ర పథకాలతో సంబంధం లేదు
ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదైతేనేం, అది రాష్ట్రంలో చట్టబద్ధమైన భూయాజమాన్య హక్కును కల్పించదని ప్రభుత్వం తెలిపింది.
భూమిపై యాజమాన్య హక్కుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డులే ప్రమాణంగా తీసుకుంటారని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.