
Nadikudi- Srikalahasthi: నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక.. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైన్
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరు నుంచి తిరుపతి వైపు ప్రయాణ దూరాన్ని తగ్గించే దిశగా కీలకంగా మారబోతున్న నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో ప్రగతిపథంలో ఉంది.
దర్శి, పొదిలి వరకు లైన్ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
ఈ ఏడాది ఆగస్టులో ఈ కొత్త మార్గాన్ని ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నందున పనులు మరింత వేగంగా కొనసాగిస్తున్నారు.
మూడు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మాణంలో..
ఈ రైల్వే మార్గంలో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో మూడు స్టేషన్ల నిర్మాణం చేపట్టారు.
యడవల్లి, కనిగిరి, గార్లపేట స్టేషన్లు ఇప్పుడు తుదిదశ పనుల్లో ఉన్నాయి. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
ప్రత్యామ్నాయ రూటుగా..
ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లోని దర్శి, కనిగిరి, పొదిలి ప్రాంతాలవారు ఈ మార్గం సిద్ధం కావాలని ఎంతో ఆశిస్తున్నారు.
ఈ లైన్ కనిగిరి, పామూరు మీదుగా నెల్లూరు జిల్లా వైపు సాగి, చివరికి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి వద్ద ముగుస్తుంది.
విజయవాడ - గూడూరు - తిరుపతి మధ్య ఇప్పటికే ఉన్న రైల్వే మార్గంపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు, అలాగే వరదలు, తుపానుల వంటి సహజ విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఈ లైన్ ఉపయోగా పడుతుందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌కు 2011-12లోనే ఆమోదం లభించింది. మొత్తం 309 కిలోమీటర్ల పొడవుతో రూపుదిద్దుకుంటున్న ఈ మార్గంలో ఇప్పటికే కొన్ని విభాగాలు పూర్తయ్యాయి.
వివరాలు
బడ్జెట్‌లో భారీ నిధుల మంజూరు
గుండ్లకమ్మ - దర్శి మధ్య 27 కిలోమీటర్ల ట్రాక్‌ను ప్రారంభించారు. అలాగే, పిడుగురాళ్ల - సావల్యాపురం (47 కిమీ) సెక్షన్, గుండ్లకమ్మ - దర్శి (27 కిమీ) సెక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
నెల్లూరు జిల్లాలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
రైల్వే శాఖ 2024-25 వార్షిక బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం రూ.380 కోట్లు కేటాయించింది.
దర్శి - కనిగిరి (52 కిమీ), వెంకటగిరి - ఆత్మకూరు (15 కిమీ), కనిగిరి - పామూరు (35 కిమీ), ఆత్మకూరు - వెంకటపురం (43 కిమీ), పామూరు - ఒబులాయపల్లె - వెంకటపురం (90 కిమీ) మార్గాల్లో పనులు పూర్తిచేయాల్సి ఉంది.
వివరాలు
తగ్గనున్న ప్రయాణ సమయం
నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గం పూర్తయిన తర్వాత.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకునే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
ప్రస్తుతానికి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మూడు మార్గాలున్నాయి - ఒకటి వరంగల్, విజయవాడ మీదుగా, రెండోది నల్గొండ, గుంటూరు ద్వారా, మూడోది మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా.
కానీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే.. ఈ మూడు మార్గాలతో పోల్చితే తక్కువ దూరంతో త్వరగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది.