LOADING...
Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌
చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌

Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2024
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇస్కాన్ (ISKCON) సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి (Chinmoy Krishnadas) బంగ్లాదేశ్‌లో అరెస్టు కావడం పై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన్ను అరెస్టు చేయడమేకాకుండా, బెయిల్ కూడా నిరాకరించడం పట్ల భారత విదేశాంగశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మైనార్టీలపై దాడులు తగవని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులు,ఇతర మైనార్టీలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, బంగ్లాదేశ్ అధికారులను భారత ప్రభుత్వం కోరినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు.

వివరాలు 

కృష్ణదాస్ విడుదలకు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి

ఇప్పటికే బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై తీవ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడుతున్న సందర్భంలో ఈ తాజా సంఘటన మరింత ఆందోళనకరమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. మైనార్టీల ఇళ్లలో దోపిడీ,వ్యాపార కేంద్రాల విధ్వంసం, దేవాలయాల అపవిత్రం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడమే లక్ష్యంగా పనిచేసే వ్యక్తులపై అభియోగాలు మోపడం తీవ్రవిచారకరమని పేర్కొన్నారు. ఇస్కాన్ ఆలయ అధికారులు కూడా ఈ విషయంలో భారత ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. కృష్ణదాస్ విడుదలకు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇస్కాన్ తమ అధికారిక సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో ఈ అంశాన్ని పంచుకుంటూ,తమ సంస్థ శాంతి,ప్రేమతో కూడిన భక్తి ఉద్యమం మాత్రమేనని,ఈ అంశంపై తప్పుడు ఆరోపణలు అవమానకరమని స్పష్టం చేశారు.

వివరాలు 

బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొని, అక్కడ బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ అరెస్టు పట్ల పలు సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టాయి.