Uttarkashi Tunnel : ఉత్తరకాశీ టన్నెల్ లో రాత్రివేళ డ్రిల్లింగ్‌కు శిథిలాల ఆటంకం
ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలిన ఘటనలో రాత్రివేళ డ్రిల్లింగ్‌కు శిథిలాలు ఆటంకం కలిగిస్తున్నాయి. గురువారంతో సొరంగంలో సహాయక కార్యకలాపాలు పనులు ఐదో రోజుకు పూర్తై నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ మేరకు దాదాపుగా 60 గంటలకుపైగా లోపల చిక్కుకున్న సుమారు 40మంది కార్మికులను రక్షించే పనుల్లో రాత్రి వేళ తవ్వకాలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రంలోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఆటంకాలు ఎదురైతే రెస్క్యూ పనులు అదనంగా మరో రోజు కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహణలో థాయ్‌లాండ్ కంపెనీ, నార్వే జియోటెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి నిపుణులైన రెస్క్యూ టీమ్‌ల పర్యవేక్షణలో రెస్క్యూ కొనసాగుతోంది.
అధిక పనితీరు గల ఆగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని తెప్పించిన అధికార యంత్రాంగం
మరోవైపు రెండు,మూడు పైపులు ఒక్కొక్కటి 900 మిల్లీమీటర్లతో, 6 మీటర్ల పొడవు ఉన్నవి పూర్తిగా శిథిలాలవైపు మళ్లించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు అధునాతన ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్, సొరంగంలో పేరుకుపోయిన 21 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసిందని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లోని సిల్క్యారా కంట్రోల్ రూమ్ తెలిపింది. అయినప్పటికీ, శిథిలాల లోపల గట్టి పదార్ధం ఉండటం వల్ల డ్రిల్లింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. రెస్క్యూ ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు 24 టన్నుల బరువున్న అధిక-పనితీరు గల ఆగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని తెప్పించారు. మరో 45 నుంచి 60 మీటర్ల వరకు డ్రిల్లింగ్ కొనసాగించాల్సి ఉంటుంది.అధనాతన యంత్రం గంటకు 5 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉంది.