
Vantara: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం: వంటారా
ఈ వార్తాకథనం ఏంటి
జూన్‌నగర్ (గుజరాత్)లోని గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ సెంటర్ అయిన వంటారా, సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు పూర్తిగా సహకరించనున్నట్లు మంగళవారం (ఆగస్టు 26) స్పష్టం చేసింది. ఆగస్టు 25న వెలువడిన ఉత్తర్వులో, వంటారాపై వచ్చిన ఆరోపణలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ విచారణ జరుగుతున్నప్పటికీ, ఇది చట్టపరమైన అధికారులపై లేదా వంటారా పనితీరుపై అనుమానం వేసినట్లు పరిగణించరాదని, ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
వివరాలు
ఆగస్టు 25న వంటారా పై వచ్చిన ఆరోపణలపై SIT ఏర్పాటు
వంటారా ఒక ప్రకటనలో "సుప్రీంకోర్టు ఉత్తర్వును గౌరవంతో స్వీకరిస్తున్నాం.మేము పారదర్శకత, చట్టపాలన,కరుణకు కట్టుబడి ఉన్నాం.మా లక్ష్యం జంతువుల రక్షణ,పునరావాసం,సంరక్షణ.SIT కి పూర్తి సహకారం అందిస్తాం. జంతువుల శ్రేయస్సు కోసం మేము చేస్తున్న పనిని కొనసాగిస్తాం. ఊహాగానాలు లేకుండా,ఈ ప్రక్రియ జంతువుల మేలు దృష్ట్యా జరగాలని కోరుకుంటున్నాం" అని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆగస్టు 25న వంటారా పై వచ్చిన ఆరోపణలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి నలుగురు సభ్యుల SIT ను ఏర్పాటు చేసింది. జస్టిస్ పంకజ్ మిథల్,జస్టిస్ పీబీ వరాలే ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా,మీడియాలో వచ్చిన కథనాలు,అలాగే కొన్ని ఎన్జీఓలు,వన్యప్రాణి సంస్థలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పిల్లు వేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను విన్న తరువాత ఈ కమిటీ ఏర్పాటైంది.
వివరాలు
సెప్టెంబర్ 12లోగా నివేదిక సమర్పించాలని సుప్రీం గడువు
ఈ SIT కు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అధ్యక్షత వహిస్తుండగా మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే, మాజీ IRS అధికారి అనీష్ గుప్తా సభ్యులుగా నియమితులయ్యారు. ఈ SIT బాధ్యతలు: దేశీయంగా,విదేశాల నుండి జంతువుల సేకరణ,వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్,జూ రూల్స్,అంతర్జాతీయ CITES ఒప్పందం,అలాగే ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ చట్టాల అమలు పరిశీలన. అదేవిధంగా ఆర్థిక నియమావళి ఉల్లంఘన,మనీలాండరింగ్ వంటి ఆరోపణలను కూడా సమీక్షించనుంది. SIT తన నివేదికను 2025 సెప్టెంబర్ 12లోగా కోర్టుకు సమర్పించాలి.ఆ తర్వాత సెప్టెంబర్ 15న ఈ వ్యాజ్యాలను మళ్లీ విచారణకు తీసుకుంటామని కోర్టు తెలిపింది. నివేదిక ఆధారంగా అవసరమైతే తదుపరి ఆదేశాలు ఇస్తామని,లేదంటే వ్యాజ్యాలు ముగుస్తాయని స్పష్టంచేసింది.