ఉత్తర్‌ప్రదేశ్: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు. యూపీలో ఇప్పటికే ఐసీసీ హోదా కలిగిన కాన్పూర్, లక్నో స్టేడియాలు ఉండగా, ఇది మూడోది. వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని అనేక ప్రత్యేకలతో నిర్మించనున్నారు. శివుడి ప్రేరణతో ఈ స్టేడియం డిజైన్‌ను ప్లాన్ చేశారు. ఇందులో త్రిశూల ఆకారపు ఫ్లడ్‌లైట్లు, చంద్రవంక ఆకారపు పైకప్పు కవర్లు, ఘాట్ మెట్లను తలపించే సీటింగ్ ఉంటాయి. గంజరి ప్రాంతంలో 30 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇది ముఖభాగంలో బిల్వ పాత్ర ఆకారంలో ఉంటుంది.
సిట్టింగ్ కెపాసిటీ, వ్యయం ఎంతంటే?
వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 121 కోట్లు వెచ్చించగా, నిర్మాణానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూ. 330 కోట్లు వెచ్చించనుంది. 30,000 కంటే ఎక్కువ మంది కూర్చునేలా దీన్ని నిర్మిస్తున్నారు. 2025 చివరి నాటికి ఈ స్డేడియాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంను ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) బీసీసీఐ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తోంది. ఇది దీర్ఘకాలిక ప్రాతిపదికన యూపీసీఏకు లీజుకు ఇవ్వనుంది. ఇందులో ఏడు పిచ్‌లు, ప్రాక్టీస్ నెట్‌లు, లాంజ్‌లు, వ్యాఖ్యాతల బాక్స్, మీడియా సెంటర్, పెద్ద హాస్టల్ ఉంటాయి. లార్సెన్ & టూబ్రో అనే నిర్మాణ సంస్థ ఇప్పటికే పనులను మొదలు కూడా పెట్టింది.