రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఆమె అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన జాకెట్‌తో బుధవారం సభకు వచ్చిన ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలు ప్రారంభమైనప్పటి నుంచి హిండెన్‌బర్గ్-అదానీ అంశం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు తనదైన శైలిలలో సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరూ విమర్శించినందుకు చాలా సంతోషంగా ఉందని వ్యంగ్యాస్త్రాలను సంధించారు ప్రధాని మోదీ.
5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం: మోదీ
రాష్ట్రపతి ప్రసంగం ఈ దేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు వేడుకల క్షణమని ప్రధాని అన్నారు. సవాళ్లు జీవితంలో భాగమని, అయితే 140 కోట్ల మంది పౌరుల ధైర్యం ఈ సవాళ్ల కంటే సమర్ధవంతమైనదని పేర్కొన్నారు. భారత్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం గర్వించదగ్గ విషయమన్నారు. జీ20కి ఆతిథ్యం ఇస్తున్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు మోదీ పరోక్ష విమర్శలు చేశారు.