LOADING...
Vice President Election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంటు భవనంలో పోలింగ్
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంటు భవనంలో పోలింగ్

Vice President Election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంటు భవనంలో పోలింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉప రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించడానికి పూర్తి సన్నాహకాలు పూర్తయ్యాయి. ఈ ఎన్నిక మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు నూతన భవనంలోని 'ఎఫ్‌-101 వసుధ' గదిలో జరిగే POLLING ద్వారా జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మంగళవారం సాయంత్రం 6 గంటలకు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు పార్లమెంటులో ఉభయసభల కలిపి మొత్తం సభ్యుల సంఖ్య 788గా ఉండగా,ఏడు స్థానాలు ఖాళీగా ఉండటం వల్ల ప్రస్తుతానికి 781 మంది మాత్రమే ఉన్నారు. అయితే భారత రాష్ట్ర సమితి (BRS) నుండి 4 మంది, బిజద (BJD) నుండి 7 మంది ఎంపీలు పోలింగులో పాల్గొనడంలేదని ప్రకటించారు. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలవనున్నారు.

వివరాలు 

ఎన్నికలో ఎన్డీయేకి 425 మంది సభ్యుల మద్దతు 

ఈ ఎన్నికలో ఎన్డీయేకి 425 మంది సభ్యుల మద్దతుంది. వైకాపా, ఇతర మిత్రపార్టీల మద్దతు కలిపితే మొత్తం ఓట్ల సంఖ్య 438కి పెరిగే అవకాశముంది. మరోవైపు, ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్‌డీయే అభ్యర్థి గెలుపు ఖాయం అని అర్థమవుతున్నా, ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని అభ్యర్థిగా ముందుకు తెచ్చారు. పార్టీలను మించి ప్రజాస్వామ్య భావనపై ఓటేయాలని విస్తృత ప్రచారం చేశారు. ఎన్డీయే అభ్యర్థి సి. పి. రాధాకృష్ణన్‌ ఎటువంటి హడావుడిలేకుండా తన పని తాను చేసుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు సాగుతున్నారు.

వివరాలు 

రహస్య బ్యాలెట్‌.. విప్‌ ఇవ్వకూడదు 

ఈ ఎన్నిక పూర్తిగా రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఎన్నికల సంఘం స్పష్టంగా ప్రకటన చేసి, పార్టీలు తమ ఎంపీలకు విప్ ఇవ్వకుండా ఉండాలని సూచించింది. ఎంపీలు స్వతంత్రంగా తమ నచ్చిన అభ్యర్థికి ఓటేయగలుగుతారు. అయినప్పటికీ, చాలా మంది ఎంపీలు ఇప్పటికే తమ పార్టీలకు అనుగుణంగా మద్దతు ప్రకటించారు. ఎన్‌డీయే ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి, ప్రత్యర్థి కూటమి బయట ఉన్న వేర్వేరు పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. గత రెండు రోజులుగా అన్ని పార్టీలు ఎంపీలను ఢిల్లీకి రప్పించి, ఓటింగ్‌కు సిద్ధం చేశారు.

వివరాలు 

రహస్య బ్యాలెట్‌.. విప్‌ ఇవ్వకూడదు 

విపక్ష కూటమి నాయకులు సోమవారం పార్లమెంటు పాత భవన సముదాయంలో సమావేశమై, ఓటు వేయడంలో ఐక్యతను చాటాలని, ప్రాధాన్య ఓటు పద్ధతిలో కేవలం 1 అంకెను మాత్రమే వేయాలని, రెండో ప్రాధాన్యతను నమోదు చేయొద్దని ఎంపీలకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నసీర్ హుసేన్, మాణికం ఠాగూర్, తృణమూల్ నేత శతాబ్దిరాయ్‌లు ఎన్నికల ఏజెంట్లుగా నియమితులయ్యారు. ప్రధాన పార్టీ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, టి.ఆర్. బాలు, అఖిలేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీయే పక్షాలు కూడా కూటమి ఎంపీలందర్నీ దిల్లీలో మోహరించి పోలింగు సమయంలో జాగ్రత్తల గురించి వివరించాయి. ఈసారి ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది.

వివరాలు 

ప్రాధాన్య ఓటు విధానం - గులాబీ బ్యాలెట్ పత్రాలు 

తమ ప్రాధాన్యానికి అనుగుణంగా అభ్యర్థులకు ఓట్లు వేయొచ్చు.మొదటి ప్రాధాన్యం ఇస్తే గడిలో '1' అంకె వేయాలి, రెండో ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థికి '2' అంకె వేయాలి. అందుకు మాత్రమే ఎన్నికల సంఘం అందించిన పెన్ను ఉపయోగించాల్సివుంటుంది. ఎంపీల సంఖ్య తగ్గినప్పటికీ,గత 2022 ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌ 528 ఓట్లు (74.37%) పొందగా, కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా కి 182 ఓట్లు (25.63%) మాత్రమే లభించారు. ఈసారి కూడా ఎన్డీయే అభ్యర్థి గెలుపు ఖాయం అని అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికలో ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన సందర్భంలోనే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.