Vijaysai Reddy: జగన్ చుట్టూ కోటరీ..అందుకే పార్టీకి దూరం: విజయసాయిరెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
వై.ఎస్.జగన్ చుట్టూ కోటరీ ఉందని, అదే కారణంగా తాను ఆయనకు దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలిసిన తర్వాత తన మనసు విరిగిపోయిందని తెలిపారు.
అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్‌కు చెప్పినట్లు సాయిరెడ్డి వెల్లడించారు.
కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణ పూర్తైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
"కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుంది. జగన్ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారు. జగన్‌ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
కర్త.. కర్మ.. క్రియ.. విక్రాంత్ రెడ్డి..
"కాకినాడ పోర్టులో వ్యాపారం చేశారా? లేదా? కోట్లు ఆర్జించారా?"అన్న విషయం తనకు తెలియదని సీఐడీ విచారణలో చెప్పినట్లు వెల్లడించారు.
గతంలో సీబీఐ, ఈడీ కేసుల్లో జేడీ లక్ష్మీ నారాయణ తనను"ఏ2" గా చేర్చారని,ఇప్పుడు కాకినాడ పోర్టు కేసులో కూడా అదే స్థాయిలో ఉంచారని అన్నారు.
"ఇది తప్ప నేను చేసిందేమీ లేదు. ఏ2 ను నాకు ఒక స్టాండర్డ్‌గా మార్చేశారు.ఈ కేసు నమోదైనప్పుడు నేను వైసీపీలోనే ఉన్నాను.
అప్పట్లో నాకు పూర్తిగా వివరాలు తెలియలేదు.కానీ ఇప్పుడు నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి. ఎవరు చేశారు? ఎలా చేశారు? అన్నదీ తెలిసింది."
జగన్‌ను కేసు నుంచి తప్పించేందుకు తాను,విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారని, అయితే అవన్నీ తనకు తెలియవని సమాధానమిచ్చినట్లు తెలిపారు.
వివరాలు
సు ఇక్కడితో ఆగినా, ఆగకపోయినా నాకు నష్టమేమీ లేదు
"నా అల్లుడు శరత్ చంద్రారెడ్డి కంపెనీ విషయంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోను. ఎవరికైనా ఉద్యోగం ఇప్పించమని అడగను. నా కుటుంబ బంధాలే నాకు ముఖ్యమైనవి. జగన్ మోహన్ రెడ్డి ప్రమేయం ఉందా?" అని సీఐడీ అడిగిందని, తాను "నాకు తెలిసినంతవరకు కేవీరావు, శరత్ చంద్రారెడ్డికి డీల్ చేసింది విక్రాంత్ రెడ్డేనని" చెప్పినట్లు వెల్లడించారు.
"ఈ కేసు ఇక్కడితో ఆగినా, ఆగకపోయినా నాకు నష్టమేమీ లేదు. నేను కేవీరావుతో మాట్లాడినట్లు నిరూపించండి. నేను ఎవరి దగ్గరా ప్రతిఫలం ఆశించలేదు."
వివరాలు
మూడున్నరేళ్లు అవమానాలు పాలయ్యా!
"వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు నాకూ, మా నాయకుడికీ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, జగన్ మోహన్ రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి, అందులో విజయం సాధించారు.
గత మూడున్నరేళ్లుగా నేను అవమానాలను ఎదుర్కొన్నాను. నేను దిగిన ప్రతి మెట్టూ ఇంకొకరికి పైకి వెళ్లే అవకాశంగా మారింది.
దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు. ఈ పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు నేను ఏ విధంగానూ నష్టపోవడం లేదు. చిత్తశుద్ధితో పనిచేశాను. అయినా, ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డి బాగుండాలని కోరుకుంటున్నాను.
"జగన్ చుట్టూ ఉన్న కోటరీ నుంచి ఆయన ఎప్పుడు బయటపడతారో, ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. అంతకుమించి నేను ఏమీ చెప్పలేను."
వివరాలు
కోటరీ వల్లే జగన్‌కు దూరమయ్యా!
"బయట నుంచి సమాచారం వెళ్లాలన్నా, కొత్త వారిని పరిచయం చేయాలన్నా ఈ కోటరీకి ఏదో ఒక రకంగా లాభం ఉండాల్సిందే. అప్పుడే దేవుడి దగ్గరకు పంపుతారు. అక్కడ జరిగేది అదే.
నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదు. దీని వల్ల అతడితో పాటు పార్టీ, ప్రజలు అందరూ నష్టపోతారు.
ఈ కోటరీ వల్లనే ఆయనకు దూరమయ్యా. జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడినప్పుడు తాను చాలా స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు.
వివరాలు
ఆ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదు
"మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీ కొనసాగాల్సిన అవసరం లేదు. అందుకే వెళ్లిపోతున్నా. చుట్టూ ఉన్న వాళ్ల మాటలు విని తప్పుదోవ పట్టొద్దు. మీకు నిజాలు, అబద్ధాలు ఎవరు చెబుతున్నారో పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి. అప్పుడే ప్రజలకు ఉపయోగపడతారు. భవిష్యత్‌లోనూ మీరు ప్రజలకు సేవ చేయాలి. ఈ చుట్టూ ఉన్న వాళ్ల మాటల వినొద్దు" అని జగన్‌కు చెప్పినట్లు తెలిపారు.
తిరిగి ఆ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. "'ఘర్ వాపసీ' నాకు వర్తించదు. ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం ఇప్పటివరకు లేదు." అని విజయసాయిరెడ్డి తెలిపారు.