LOADING...
Sonia Gandhi: వక్ఫ్‌ బిల్లు ఆమోదంపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
వక్ఫ్‌ బిల్లు ఆమోదంపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

Sonia Gandhi: వక్ఫ్‌ బిల్లు ఆమోదంపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ వక్ఫ్‌ బిల్లును లోక్‌సభలో 'బుల్‌డోజ్‌' చేశారని తీవ్ర విమర్శలు చేశారు. వివాదాస్పద పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం నడుమ వక్ఫ్ సవరణ బిల్లు - 2024 లోక్‌సభలో ఆమోదం పొందిందని తెలిపారు. తమ పార్టీ ఈ బిల్లుపై స్పష్టమైన వైఖరిని కలిగి ఉందని స్పష్టం చేస్తూ, ఈ చట్టాన్ని రాజ్యాంగంపై తీవ్రమైన దాడిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు ఇటీవల లోక్‌సభలో ఆమోదం పొందింది. నేడు ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎగువ సభలో తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.

వివరాలు 

ప్రతిపక్ష సభ్యులకు తగినంతగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు: సోనియా 

గురువారం ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ, లోక్‌సభ ప్రొసీడింగ్స్‌ను బుల్‌డోజ్‌ చేశారని తీవ్రంగా విమర్శించారు. దాదాపు 12 గంటలపాటు చర్చ జరిగినప్పటికీ, ప్రతిపక్ష సభ్యులకు తగినంతగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఈ బిల్లు దేశ ప్రయోజనాలకు, ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు రాబోతున్న నేపథ్యంలో, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పార్టీ సభ్యులను కోరారు. ప్రతిపక్షాల మధ్య సమన్వయం పెంచి రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

వివరాలు 

అర్ధరాత్రి 12 గంటలకు ఓటింగ్

మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కేవలం కాగితంపై పరిమితం చేయాలని చూస్తోందని, దేశాన్ని అగాధంలోకి నెడుతున్నదని సోనియా గాంధీ ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడమే బీజేపీ అసలైన లక్ష్యమని, దేశ ప్రజలపై నిఘా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా,వక్ఫ్ సవరణ బిల్లు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర న్యాయ,మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 12 గంటలపాటు చర్చ జరిగిన అనంతరం, అర్ధరాత్రి 12 గంటలకు ఓటింగ్ నిర్వహించారు. ఈ బిల్లుకు అనుకూలంగా 282 మంది ఎంపీలు ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు ఈ బిల్లును రాజ్యసభలో చర్చించనున్నారు.