Page Loader
Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం 
లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం

Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. నిరసనల నడుమ బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై చర్చను ప్రారంభించారు. దాదాపు 8 గంటల పాటు చర్చ కొనసాగిన తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించించేందుకు కట్టుబడి ఉండగా, విపక్షాలు మాత్రం దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కొత్త బిల్లును కేంద్రం వక్ఫ్‌ పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు, అలాగే మహిళల పాత్రను కీలకంగా నిలిపేందుకు తీసుకొచ్చింది.

వివరాలు 

వక్ఫ్‌ చట్టంలో సుమారు 40 సవరణలు

ఇందులో భాగంగా 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో సుమారు 40 సవరణలు చేయనున్నారు. ముస్లిం సమాజం నుంచి వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఆగస్టులోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపారు. ఈ కమిటీ పలు సిఫారసులతో బిల్లుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం మళ్లీ ఈ బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో ఎన్డీయే కూటమికి మెజారిటీ ఉన్నందున, ఈ బిల్లును ఆమోదించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.