
#NewsBytesExplainer: జగన్ చంద్రబాబుకు భయపడ్డారా? అసెంబ్లీ సమావేశాకి జగన్ గైర్హాజరుకు కారణమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఆయన భయపడ్డారా? లేకపోతే సభలో పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుందనే అనుమానంతో వెనక్కి తగ్గారా? లేదా గతంలో తాము ప్రవర్తించినట్లుగానే ఇప్పుడు అధికార పార్టీ నేతలు స్పందిస్తే పరిస్థితి ఏం అవుతుందోననే సందేహమా? ఏ కారణం అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఉత్కంఠగా చూడాలనుకున్న ప్రజలకు ఆశించిన చర్చలు కనిపించకుండాపోయాయి. ప్రతిసారీ లాగే, ఈసారి కూడా తొలి రోజే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం పెద్ద చర్చనీయాంశమైంది. వీరి గైర్హాజరుతో సోషల్ మీడియాలో విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు విస్తారంగా వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష హోదా
ప్రతిపక్ష హోదా లేకపోవడం పెద్ద అడ్డంకి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ స్వరం పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలని ప్రయత్నించినా అనుమతుల పేరుతో అడ్డు పడుతుండగా, అసెంబ్లీలో ప్రశ్నించాలన్నా తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇది వైఎస్ జగన్‌కు పెద్ద సవాలుగా మారింది. శాసనసభలు అంటే అధికార పార్టీ నిర్ణయాలను పరిశీలించి తప్పులు చూపే వేదిక. అలాంటి సమావేశాలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయింది.
ఫస్ట్ డే
మొదటి రోజే గైర్హాజరు
నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమ్యాయి. కానీ జగన్ హాజరు కాలేదు. దీనిపై అనేక విమర్శలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికి .. అసలు కారణం ఏమై ఉంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 11 మాత్రమే. ఇది గతంలో టీడీపీ బలంతో పోల్చుకుంటే సగం కూడా లేనట్లే. అందువల్ల ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ హోదా లేకుండా సభకు వెళితే సాధారణ ఎమ్మెల్యేల ప్రాధాన్యతే దక్కుతుంది. ప్రోటోకాల్, మాట్లాడే సమయం అన్నీ ఇతర ఎమ్మెల్యేల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి తాను ఒక్కడినే 164 మంది ఎమ్మెల్యేలకి కౌంటర్ ఇవ్వడం కష్టమని భావించి సమావేశాలకు దూరంగా ఉన్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
భయం
అవినీతి కేసుల భయం?
ఇక మరో కారణం కూడా చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, అవినీతి అంశాలను కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే జగన్ సన్నిహితుడు, ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు జైలుకెళ్లారు. అదేవిధంగా మెడికల్ కాలేజీ వ్యవహారంలో కూడా కూటమి సర్కారు జగన్ వర్గాన్నే లక్ష్యంగా చేసుకుందని చర్చ. ఈ నేపథ్యంలో సభలో ప్రశ్నలు ఎదుర్కోవడం కంటే వెళ్లకపోవడమే మంచిదని జగన్ భావించారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన కీలక నేతలతో ప్రత్యేకంగా చర్చించారని సమాచారం.
గతం
గతం గుర్తొస్తోందా?
వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో టీడీపీకి కేవలం 23 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు సభలో తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో ఆయనను అవమానించారు. అంతలా వేధించడంతో, చంద్రబాబు ఒక దశలో అసెంబ్లీకి వాకౌట్ చేసి తిరిగి సీఎం అయిన తరువాతే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఇప్పుడు ఆ గతం గుర్తొచ్చి జగన్ వెనకడుగు వేశారనే మాట వినిపిస్తోంది.
పాలిటిక్స్
రివెంజ్ పాలిటిక్స్ విమర్శలు
శాసనసభ, మండలి అనేవి ప్రజల సమస్యలను ప్రస్తావించి పరిష్కారం కోసం పోరాడే రాజ్యాంగబద్ధ వేదికలు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇవి రివెంజ్ పాలిటిక్స్ వేదికలుగా మారిపోయాయని విమర్శలు ఉన్నాయి. గతంలో టీడీపీ నాయకుడిని అవమానించినందుకు, ఇప్పుడు తాము సభలోకి వెళితే అదే తరహాలో అవమానాలు ఎదురవుతాయనే భయంతోనే వైసీపీ దూరంగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.