
Kolkara Doctor Murder Case: సందీప్ ఘోష్ లైసెన్స్ రద్దు చేసిన డబ్ల్యూబీ మెడికల్ కౌన్సిల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనలో ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.
తాజాగా ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది. పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC) గురువారం ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు వెల్లడించింది.
దీంతో, డబ్ల్యూబీఎంసీ నిర్వహించే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ జాబితా నుంచి ఘోష్ పేరును తొలగించారని సంబంధిత అధికారి తెలిపారు.
ఘోష్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA)బెంగాల్ విభాగం ఇటీవల డబ్ల్యూబీఎంసీని అభ్యర్థించింది.
సెప్టెంబర్ 7న మెడికల్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా,మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది.ఘోష్ నుంచి సమాధానం రాకపోవడంతో ఆయనపై వేటు వేయడం జరిగింది.
వివరాలు
పాలిగ్రాఫ్ పరీక్ష,లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో తప్పుడు సమాధానాలు
ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో పీజీ వైద్య విద్యార్థి మరణించటం గుర్తించారు.
మొదట ఇది ఆత్మహత్యగా భావించినప్పటికీ,దర్యాప్తులో ఇది హత్యాచారం అని తేలింది.
ఈ ఘటనలో వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు మరుసటి రోజే అరెస్టు చేశారు.
ఈ దర్యాప్తు సమయంలోనే ఘోష్ అవినీతి వ్యవహారాలు వెలుగుచూడటం పెద్ద దుమారానికి దారితీసింది. ఆర్థిక అవకతవకల కేసులో సీబీఐ ఘోష్‌ను అదుపులోకి తీసుకుంది.
అంతేకాక,తాలా పోలీసు స్టేషన్ అధికారి అభిజిత్ మండల్‌ను కూడా ఈకేసులో అరెస్టు చేశారు.
వారిద్దరినీ కోర్టు ముందు హాజరుపరిచారు.ఘోష్,మండల్ కలిసి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు సీబీఐ కోర్టులో తెలిపింది.
ఘోష్ పాలిగ్రాఫ్ పరీక్ష,లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో తప్పుడు సమాధానాలు ఇచ్చినట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(CFSL)నివేదికలో వెల్లడించింది.