పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిష్టాత్మమైన పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు దిల్లీలో గురువారం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. పోలవరం పునరావాసం ప్యాకేజీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మంత్రి రాంబాబు ఆంధ్రప్రదేశ్ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకు చాలా సమయం పడుతుందని చెప్పిన మంత్రి రాంబాబు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. పోలవరం గైడ్‌బండ్ తమ హయాంలోనే కుంగిందని, ఎందుకు అలా జరిగింది అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. జరిగిన తప్పిదాన్ని సరి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పోలవరం సందర్శనకు కేంద్ర మంత్రి అంగీకరించారు : అంబటి రాంబాబు
గైడ్ బండ్ తప్పిదం కాంట్రాక్టర్ తప్పా, లేక డిజైన్ లో లోపం కారణంగా కూలిందా, లేదా భూమి సమస్య అనే అంశాన్ని నిర్థారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఒరిజినల్ డిజైన్‌లో గైడ్ బండ్ అనేది లేదని, కొంత కాలానికి దాన్ని జత కలిపారని మంత్రి చెప్పుకొచ్చారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీని నియమించామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టులో తప్పిదాలు జరిగాయన్నారు. చంద్రబాబు హయాంలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకైనా పునాది వేశారా అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు కేంద్ర మంత్రి షెకావత్ అంగీకరించారని మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.