
Telangana: అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వాతావరణశాఖ రేపటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించారు.
ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి, పైకి వెళ్లేకొద్ది దక్షిణ వైపు వంగి ఉందని చెప్పారు.
ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశలో ప్రయాణిస్తూ, దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను చేరే అవకాశం ఉందని తెలిపారు.
ఈ పరిస్థితుల వల్ల, తెలంగాణలో రాగల నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
వివరాలు
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ముఖ్యంగా మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించారు.ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
శనివారం (ఆగస్టు 31) మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందుకు సంబంధించి ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
నేడు హైదరాబాద్‌లో భారీ వర్షం
ఆదివారం,సోమవారం రోజుల్లో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో నేడు వాతావరణం పొడిగా ఉండనుందని, ఉదయం మేఘాలు కమ్ముకొని, జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు, సాయంత్రం తర్వాత భారీ వర్షాలకు అవకాశముందని చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.