
Andhra Rains: ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ కారణంగా సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పిడుగులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, పాత హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదని ప్రజలకు సూచించారు. పిడుగులు పడే ప్రమాదం దృష్ట్యా రైతులు పొలాల్లో పనులు చేసే సమయంలో, పశువులను మేపే వేళలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తాజా వాతావరణ అంచనాల ప్రకారం బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వివరాలు
తీరప్రాంత మత్స్యకారులకు జాగ్రత్తలు
దాని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. అల్పపీడనం బలపడితే గాలుల వేగం పెరిగి, సముద్రం ఆందోళనకర స్థితిలోకి మారవచ్చని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సలహా ఇచ్చింది. ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, తెనాలి, ఓంగోలు, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా.
వివరాలు
రాబోయే 48 గంటల్లో వర్షాలతో పాటు పిడుగులు, గాలివానలు సంభవించే అవకాశం
రైతులు, మత్స్యకారులు ఈ రెండు రోజులపాటు వాతావరణ హెచ్చరికలను నిరంతరం గమనించడం మంచిదని సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామ పంచాయతీ శాఖలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తాత్కాలిక నివాస కేంద్రాలను సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం మేఘావృతంగా మారింది. రాబోయే 48 గంటల్లో వర్షాలతో పాటు పిడుగులు, గాలివానలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉండడంతో, ప్రజలు అధికారుల సూచనలను పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.