
Harrop Drone: ఇజ్రాయెల్ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యునిషన్ 'హారప్'.. భారత అమ్ములపొదిలో మెగా అస్త్రం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం తాజాగా పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు,రాడార్ కేంద్రాలపై దాడి చేయడంలో, ఇజ్రాయెల్‌లో తయారైన దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యునిషన్ 'హారప్'ను వినియోగించింది.
దీంతో ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణాసియాలో తొలిసారిగా వినియోగించినట్లయింది.
గురువారం భారత దళాలు, పాకిస్థాన్‌కు చెందిన హెచ్‌క్యూ-16 మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థలో భాగంగా ఉన్న ఎల్‌వై80 రాడార్ కేంద్రాలను హారప్ డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
వివరాలు
హారప్ - శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థ
హారప్ అనేది దీర్ఘశ్రేణి స్టాండాఫ్ లాయిటరింగ్ అటాక్ ఆయుధంగా పేరుగాంచింది.
దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. ఇది మానవరహిత వాహనం (UAV) క్షిపణి లక్షణాలు సామర్థ్యాన్ని కలగలిపిన అత్యాధునిక ఆయుధం.
ఈ ఆయుధం ద్వారా శత్రు ఆదేశ వ్యవస్థలు, సరఫరా కేంద్రాలు, ట్యాంకులు,గగనతల రక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ధ్వంసం చేయొచ్చు.
ఈ డ్రోన్‌లో ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు, కలర్ సీసీడీ కెమెరాలు, యాంటీ-రాడార్ హోమింగ్ సామర్థ్యాలు ఉన్నాయి.
ఇవి లక్ష్యాలను స్పష్టంగా గుర్తించేందుకు ఉపయోగపడతాయి. లక్ష్యంపై దాడికి ముందు 9 గంటలపాటు గగనవిహారం చేస్తూ పూర్తి నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది. దాంతో అత్యుత్తమ దాడి వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు.
వివరాలు
స్టెల్త్ టెక్నాలజీ
హారప్ డ్రోన్ సీటెలైట్ ఆధారిత నావిగేషన్ లేకుండానే పనిచేయగలదు. అందువల్ల జామింగ్‌కు గురయ్యే అవకాశం ఉండదు.
ఇది స్వయం నియంత్రితంగా పని చేయగలగడం వల్ల, అవసరమైతే దూర నియంత్రణ ద్వారా కూడా నడిపించొచ్చు.
అంతేకాక, చివరివేళ దాడిని నిలిపివేయడానికీ వీలుంది. ఈ డ్రోన్ భిన్న వాతావరణ పరిస్థితులలో, వివిధ భూభాగాల నుంచి ప్రయోగించగలదు.
సీల్ చేసిన కంటైనర్లలో ట్రక్కులు, యుద్ధ నౌకల నుంచి నింగిలోకి పంపవచ్చు. లక్ష్యాన్ని ఛేదించకపోతే, ఇది తిరిగి తన స్థావరానికి వస్తుంది.
శత్రు రాడార్లకు కన్పించకుండా ఉండేందుకు దీనికి స్టెల్త్ టెక్నాలజీని అందించారు.
యాంటీ-రేడియేషన్ సామర్థ్యం కూడా దీనిలో భాగం. గగనతల రక్షణ వ్యవస్థలను తొలుత ధ్వంసం చేయడానికి ఇది ప్రధాన ఆయుధంగా పనిచేస్తుంది.
వివరాలు
హారప్ కార్యక్షేత్ర పరిధి సుమారు 1,000 కీ.మీ
గగనతల లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే రాడార్లు, క్షిపణుల మాయమయ్యే విధంగా దీన్ని రూపొందించారు.
హారప్ కార్యక్షేత్ర పరిధి సుమారు 1,000 కిలోమీటర్లు. దీని వల్ల శత్రు గగనతలంలోకి చాలా లోతుగా చొచ్చుకుపోయి దాడి చేయగలదు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వాతావరణాల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది.
వివరాలు
హారప్ అభివృద్ధి చరిత్ర
1980లలో ఇజ్రాయెల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.శత్రు గగనతల రక్షణ వ్యవస్థలను తక్కువ ఖర్చుతో ధ్వంసం చేయడం లక్ష్యంగా హారప్‌ను రూపొందించారు.
క్రూజ్ క్షిపణులు,UAVల లక్షణాలను కలిపి దీనిని రూపొందించారు. 2016లో అజర్‌బైజాన్ - అర్మేనియా మధ్య జరిగిన యుద్ధంలో అజర్‌బైజాన్ హారప్‌ను ఉపయోగించి అర్మేనియాకు చెందిన సైనిక వాహనాలను ధ్వంసం చేసింది.
ఇది యుద్ధరంగంలో హారప్ ఉపయోగించిన మొదటి సందర్భం. 2018లో సిరియా గగనతల రక్షణ వ్యవస్థ 'SA-22గ్రేహౌండ్'ను ధ్వంసం చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించారు.
భారతదేశం 2009లో 10 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంతో మొదటి 10హారప్ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది.
భారతవాయుసేనలో ఇవి మొదటి పోరాట యూఏవీలుగా గుర్తించబడ్డాయి. 2019లో భారత్ మరో 54 హారప్‌లను సేకరించింది.
వివరాలు
నౌకాదళానికి ఏఎస్‌డబ్ల్యూ యుద్ధనౌక
కోల్‌కతా కేంద్రంగా, శత్రు జలాంతర్గాములను గుర్తించి వెంటాడే సామర్థ్యం కలిగిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ASW) షాలోవాటర్ క్రాఫ్ట్ యుద్ధనౌకను గురువారం భారత నేవీకి అప్పగించారు.
దీన్ని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE) అనే ప్రభుత్వ సంస్థ తయారు చేసింది.
మొత్తం 8 యుద్ధనౌకల నిర్మాణంలో ఇది మొదటిది, దీనికి 'INS అర్నాలా' అని పేరు పెట్టారు. దీని పొడవు 77.6 మీటర్లు, వెడల్పు 10.5 మీటర్లు.