LOADING...
AP Budget: ఏపీ బడ్జెట్'లో ఉద్యోగులు,పెన్షనర్‌లకు  దక్కిందేంటి..!! 
ఏపీ బడ్జెట్'లో ఉద్యోగులు,పెన్షనర్‌లకు దక్కిందేంటి..!!

AP Budget: ఏపీ బడ్జెట్'లో ఉద్యోగులు,పెన్షనర్‌లకు  దక్కిందేంటి..!! 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ.3.22 లక్షల కోట్ల భారీ అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు ముఖ్యమైన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా, సూపర్ సిక్స్ పథకాల్లో రెండింటి అమలు కోసం నిధులను కేటాయించారు. అయితే, గత ప్రభుత్వంలో ఎదురైన ఆర్థిక లోపాలు, పరిపాలనా వైఫల్యాలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఈ బడ్జెట్ పైన ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో చూసారు. మరి.. ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు దక్కిందేంటి...

వివరాలు 

ఆర్థిక మంత్రి ప్రసంగం, బడ్జెట్ విశ్లేషణ 

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సవివరంగా వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఉన్న పరిస్థితిని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను సకాలంలో చెల్లించలేకపోయిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతేకాదు, ఆర్థిక సమస్యలతో ఈ బడ్జెట్ రూపొందించడం కూడా సవాలుగా మారిందని వ్యాఖ్యానించారు. ఈసారి తొలి సారిగా రూ.3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

వివరాలు 

ఉద్యోగుల అంచనాలు, బడ్జెట్ ప్రభావం 

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిన నేపథ్యంలో, ఉద్యోగులు తమకు సంబంధించి బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటనలు వస్తాయని ఆశించారు. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పీఆర్సీ (PRC), పెండింగ్ బకాయిలు, డీఏ (DA) పెంపు వంటి అంశాలపై ఉద్యోగులు పెద్దగా ఒత్తిడి చేయలేదు. 2024 ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను ప్రకటించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. ఇప్పటికీ కొత్త పీఆర్సీ ఏర్పాటు కాలేదు. అందువల్ల ఉద్యోగులకు అనుకూలంగా ఏదైనా ప్రకటన ఉంటుందని ఆశించినా, చివరికి నిరాశే మిగిలింది.

వివరాలు 

ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగ భృతి 

ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను ఎలా స్థిరీకరిస్తున్నామనే అంశంపైనే దృష్టి పెట్టారు. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. అయితే, నిరుద్యోగ భృతిపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. స్వర్ణాంధ్ర -2047 లక్ష్యాల గురించి వివరించినా, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, భర్తీపై ప్రస్తావన లేకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. మొత్తంగా.. ఈ బడ్జెట్‌పై ఉద్యోగులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి, తమ హక్కులను సాధించుకుంటామని ఉద్యోగ సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, బడ్జెట్‌లో ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకమైన ప్రకటనలు లేకపోవడం అసంతృప్తికి కారణమైంది.