Page Loader
Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి? 
విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?

Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే విజయవాడలో నివాస గృహాల అద్దె చాలా ఎక్కువగా ఉంది. 2015లో హైదరాబాద్‌ నుండి పాలనా వ్యవహారాలను విజయవాడకు తరలించాలన్న నిర్ణయమే దీనికి కారణం. దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఉద్యోగులు, హెచ్‌ఓడీలు విజయవాడకు తరలివచ్చారు. వారి కుటుంబాలను వెంట తెచ్చుకోలేని కొందరికి ప్రభుత్వమే గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక నివాస సదుపాయాలు కల్పించి విధుల్లో నియమించింది.

వివరాలు 

పదేళ్లలో కానరాని మార్పు... 

ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భత్యం (హెచ్‌ఆర్‌ఏ) చెల్లించడంతో పాటు,వారి ఉద్యోగ హోదాకు అనుగుణంగా అద్దె భారం ప్రభుత్వమే భరిస్తోంది. అలిండియా సర్వీసులకు చెందిన అధికారులకు నెలకు రూ.40వేలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు క్యాడర్‌ బట్టి సగటున రూ.10వేల నుండి రూ.30వేల వరకు నివాస భత్యం లభిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటవుతుందనే ఊహతో రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. 2014లో అమరావతిని కృష్ణా నదీ తీరంలో అధికారికంగా ప్రకటించగా,2015జూన్‌లో ఉద్యోగుల్ని అమరావతికి తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారు. 2016జూన్‌ నుండి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రారంభమైంది. ఈ తరలింపుతో పాటు ఉద్యోగుల కుటుంబాలు కూడా విజయవాడ చేరడంతో నివాస గృహాలకు కొరత ఏర్పడింది.

వివరాలు 

ప్రభుత్వ ఉద్యోగులకు ఓకే.... 

విద్యాసంస్థల సమీప ప్రాంతాల్లో అద్దెలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులకు చెల్లించినంతగా అద్దె భత్యాన్ని విజయవాడలో కూడా చెల్లించాలన్న నిర్ణయం తీసుకోవడంతో అద్దె ధరలు స్వల్ప సమయంలోనే పెరిగిపోయాయి. రెండు బెడ్‌ రూమ్‌ ఫ్లాట్లకు కనీసం రూ.18,000-20,000 వరకు అద్దె వసూలు అవుతోంది. మూడు బెడ్‌రూమ్‌ ఫ్లాట్లకు రూ.30,000 వరకూ అద్దె వసూలవుతుంది. ఏసీ, ఫ్యాన్, చిమ్నీ, ఇంటీరియర్‌ ఉన్న ఫ్లాట్లకు అయితే రూ.35,000-40,000 కన్నా తక్కువకి లభించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ కారణంగా ఈ భారం లేదుగానీ, మిగిలిన వారికైతే ఇది భారంగా మారింది.

వివరాలు 

ఉపాధి అవకాశాల లేమి.. భారం మధ్యతరగతిపై 

విజయవాడలో ముఖ్యంగా ఐటీ,సేవా రంగాలపై ఆధారపడే ఉపాధి అవకాశాలు లేకపోవడంతో,అద్దె భారం మధ్యతరగతి ప్రజలపై బరువుగా పడుతోంది. గత పది సంవత్సరాలుగా అద్దె పెరుగుదల కొనసాగుతున్నా,ప్రభుత్వాలు దీన్ని గమనించలేదు. 2019లోఅమరావతి నిర్మాణం నిలిచిపోయిన తరువాత ఆ పనుల కోసం వచ్చిన ఇంజినీర్లు, కన్సల్టెంట్లు తిరిగి వెళ్లిపోయారు. దీనిప్రభావంతో అద్దెలు కొంత తగ్గాయి.తర్వాత కోవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సాధ్యమైనవారంతా స్వస్థలాలకు వెళ్లడంతో అద్దెలు తాత్కాలికంగా తగ్గాయి. కానీ తర్వాత మళ్లీ మునుపటి స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు మళ్లీ మొదలవడం,విజయవాడతో పాటు తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లాట్లకు కనీసం రూ.25,000అద్దె వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ ఉద్యోగుల్లో నెలకు కనీసం రూ.లక్ష వేతనం పొందే వారికే ఇలాంటి అద్దెను భరించగలగడం సాధ్యమవుతోంది.

వివరాలు 

నిర్మాణ వ్యయం పెరగడమే అద్దె పెరుగుదలకు కారణం 

గత ఐదేళ్లలో నిర్మాణ ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయి. బిల్డర్లు చెబుతున్నట్లుగా, 2020-22 మధ్య 30 టన్నుల ఇసుక ధర రూ.50,000 దాకా పెరిగింది. స్టీల్‌, సిమెంట్‌, శానిటరీ, ఇంటీరియర్‌ సామగ్రి ధరలు కూడా 35-40 శాతం పెరిగాయి. పెట్టుబడులపై వడ్డీలు కూడా రాని పరిస్థితులలో చాలా బిల్డర్లు అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా బిల్డర్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఇది కూడా అద్దె పెరగడానికి కారణమని బిల్డర్‌ రాజేంద్ర వివరించారు.

వివరాలు 

మందకొడిగా మారిన రియల్‌ ఎస్టేట్ రంగం 

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి వల్ల విజయవాడలో ఫ్లాట్ల కొనుగోలు, అమ్మకాల వేగం తగ్గిపోయింది. ఉన్నత ఆదాయ వర్గాలవారు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడంపై సందేహంతో ఉన్నారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం వల్ల పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఏమి జరుగుతుందోననే ఆందోళన నేపథ్యంలో అమ్మకాలు, కొనుగోళ్లలో స్పీడ్‌ తగ్గింది.