Page Loader
NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు 
ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు

NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2024
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ ప్రభుత్వంలోని ఎంబీబీఎస్‌ కళాశాలల ప్రవేశాల కోసం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌ఐ కోటా నిబంధనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కోటా మోసం తప్ప మరేమీ కాదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. పంజాబ్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ, ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థి పదం పరిధిని విస్తరించి, ఎన్‌ఆర్‌ఐ బంధువులు కూడా ఈ కోటా కింద ఎంబీబీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొంది. దీనిని పంజాబ్-హర్యానా హైకోర్టు తిరస్కరించింది, ఈ నిబంధన దుర్వినియోగానికి దారితీయొచ్చని అభిప్రాయపడింది.

వివరాలు 

 హైకోర్టు తీర్పును సమర్ధించిన జస్టిస్ జేబీ పార్దివాలా

భగవంత్‌ మన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందిస్తూ, "ప్రవేశాల సమయంలో ఎన్‌ఆర్‌ఐ దగ్గరి బంధువులను పరిగణనలోకి తీసుకోవడం ఆదాయం పొందే వ్యూహం తప్ప మరేమీ కాదు" అని పేర్కొన్నారు. జస్టిస్ జేబీ పార్దివాలా కూడా హైకోర్టు తీర్పును సమర్థించారు. ''ఈ ఎన్‌ఆర్‌ఐ కోటా వ్యాపారాన్ని ఆపాలి. ఇది పూర్తిగా మోసం. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే, ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ప్రవేశం పొందలేరు, ఎందుకంటే వారు కేవలం ఎన్‌ఆర్‌ఐ బంధువులు కాదు," అని అన్నారు.