
#NewsBytesExplainer: సంతాన సాఫల్యం మాటున.. సంతానోత్పత్తి కేంద్రాల గలీజ్ దందా..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజుల్లో సంతానం కలగక ఇబ్బంది పడుతున్న అనేక మంది దంపతులు ఫర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే రోజుకు కనీసం 200 దంపతులు పిల్లల ఆశతో ఇలాంటి కేంద్రాలకు చేరుతున్నారని అంచనా. ఈ కేంద్రాలకు వచ్చే మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం,ఆడవారిలో అండాల ఉత్పత్తి లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ పరిస్థితులను వ్యాపార అవకాశంగా మలుచుకుంటున్న కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు, బాధితుల భరోసాను తమ లాభాల కోసం వాడుకుంటున్నాయనేది ఆరోపణ.
వివరాలు
దాతల సాయంతో రహస్య వ్యాపారం
ఐయూఐ, ఐవీఎఫ్ పద్ధతుల పేరుతో కొన్ని కేంద్రాలు గోప్యంగా దందా సాగిస్తున్నాయి. యువత నుంచి వీర్యకణాలు, అండాలను సేకరించి, వాటిని ఇతర దంపతులపై ప్రయోగిస్తూ సంతాన కల్పన పేరుతో డబ్బులు గడిస్తున్నాయి. కొంతమంది దంపతుల నుంచే వీర్యకణాలు, అండాలను తీసుకుంటామని చెప్పి, మొదటి రెండు సార్లు ఆ దంపతులతోనే ప్రయత్నిస్తారు. కానీ మూడోసారి మాత్రం వారికి తెలియకుండా ఇతర దాతల నుంచి సేకరించిన జీవకణాలతో గర్భధారణ కలిగిస్తారు. ఇది డీఎన్‌ఎ పరీక్ష చేసినప్పుడే బయటపడుతుంది. తాజాగా సికింద్రాబాద్‌లోని 'సృష్టి' అనే సంతాన సాఫల్య కేంద్రంపై ఇదే తరహాలో కేసు నమోదైంది.
వివరాలు
యువతే లక్ష్యం..!
ఆర్థిక అవసరాల కారణంగా చాలామంది యువత వీర్యం లేదా అండాల దానం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇందుకోసం సెంటర్లు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. శరీర ధృడత్వం ఉన్న,క్రీడాకారుల్లా కనిపించే యువకులను వీర్యదాతలుగా ఎంచుకుంటే.. ఆకర్షణీయమైన రూపం,ఎత్తు, రంగు, ముఖాకృతి వంటి లక్షణాలున్న యువతులను అండదానానికి ఎంపిక చేస్తారు. పేద యువతను లక్ష్యంగా చేసుకుని వారితో తమ అవసరాలను తీరుస్తున్నారు. హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా ఎక్కువ అండాలు లేదా వీర్యకణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నారు. సాధారణంగా ఒక యువతి నెలకు ఒకటి లేదా రెండు అండాలు మాత్రమే విడుదల చేస్తుంది. కానీ ఇంజెక్షన్ల వల్ల అనేక అండాలు విడిపోతాయి.
వివరాలు
ఐయూఐ, ఐవీఎఫ్ కీలకం
దీని వల్ల భవిష్యత్‌లో సంతాన అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని,కొన్ని కేసుల్లో 'ఓవర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్',సంక్రమణలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫర్టిలిటీ కేంద్రాలు ప్రధానంగా రెండు విధాలుగా చికిత్సలు అందిస్తున్నాయి. అవి ఇంట్రాయుటరైన్ ఇన్‌సెమినేషన్ (IUI), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF). గర్భాశయంలో రుగ్మతలుండడం లేదా భర్త వీర్యకణాల్లో చురుకుదనం లేకపోతే, ఈ రెండు పద్ధతుల్ని వాడతారు. అండాన్ని అవసరమైన వీర్యకణంతో లాబొరేటరీలో కలిపి, ఆ తర్వాత మహిళ గర్భాశయానికి అమర్చే ప్రక్రియ ఇది. ఇది ఒక్కసారికే ఫలితం ఇస్తుందని ఊహించకూడదు. చాలాసార్లు నాలుగు లేదా ఐదు సార్లు ప్రయత్నించాల్సి వస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
వివరాలు
లక్షల్లో ఫీజులు
"మీకు పిల్లలని కలిగించే బాధ్యత మాదే" అంటూ ప్రకటనలు చేసే కొన్ని ఫర్టిలిటీ కేంద్రాలు ఒక్కో జంట నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కేంద్రాలు లక్షల్లో డబ్బులు తీసుకుని విఫలమవుతుంటే,కొన్ని మరింత దారుణంగా అనైతిక మార్గాల్లో నడుస్తున్నాయి. మొదట సైక్లింగ్ అనే పేరుతో కొన్ని ఇంజెక్షన్లు ఇస్తారు.తర్వాత ఐయూఐ,ఐవీఎఫ్ ప్రక్రియలు అమలు చేస్తారు. పలు సందర్భాల్లో దంపతుల అనుమతి లేకుండా దాతల నుంచి సేకరించిన జీవకణాలు వినియోగిస్తారు. హైదరాబాద్ పరిధిలో అనుమతి ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు 50-60 వరకు ఉండగా.. అనధికారికంగా 200కు మించి కొనసాగుతున్నట్లు అంచనా. అంతేగాక,జన్యు పరీక్షల కోసం ఉండే ల్యాబ్‌లు,స్కానింగ్ కేంద్రాలు కూడా అనుమతి లేకుండా కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
రికార్డులు ఉండవు..
వీటిని పరిశీలించాల్సిన వైద్య అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాలు తప్పనిసరిగా ఆరోగ్య శాఖ వద్ద రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి. నిబంధనల ప్రకారం లైసెన్స్‌తో పాటు తగిన రికార్డులు ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక కేంద్రాలు ఎటువంటి అధికార అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. వైద్యుల వివరాలు, స్కానింగ్ యంత్రాల సీరియల్ నంబర్లు, దాతల సమాచారం వంటి కీలక వివరాలు కూడా నమోదు చేయకపోవడం సాధారణమైంది. అయితే.. వీటిని నియంత్రించాల్సిన వైద్యాధికారులు.. అప్పుడప్పుడూ నామమాత్రంగా తనిఖీలు నిర్వర్తిస్తూ.. స్కానింగ్ మెషీన్లను సీజ్ చేస్తూ.. చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు
సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్-2021
సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్-2021 ప్రకారం,గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ వివాహితై ఉండాలి. కనీసం ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. అలాంటి స్త్రీ కేవలం ఒకసారి మాత్రమే సరోగసీ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అదికూడా సమీప బంధువులకే పరిమితం.ఆమెకు ప్రసవానంతరం 16 నెలల బీమా సేవలు అందించాలని ఈ చట్టం పేర్కొంటోంది. అదేవిధంగా,గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళకు, ఆమె ప్రసవించే శిశువు మధ్య ఏవిధమైన జన్యుపరమైన సంబంధం ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పష్టంగా ప్రకటించింది. ఇది ఒక కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన వివరణ.
వివరాలు
సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్-2021
ఈ చట్ట ప్రకారం, ఒక మహిళ తన సొంత బీజకణాన్ని (ఎగ్) అందించినట్లయితే, ఆమెను సరోగసీ తల్లి అనిపించలేమని స్పష్టం చేశారు. సరోగసీ ద్వారా పుట్టే శిశువు, దంపతుల జన్యు కణాలతోనే ఏర్పడిన పిండంగా ఉండాలని చట్టం నిబంధనలు పేర్కొంటున్నాయి. భర్త వీర్యం, భార్య మాతృజీవకణాలతో రూపొందిన పిండం మరో మహిళ గర్భంలో పెరుగుతుందని వివరించింది. అటువంటి పిండాన్ని మరో స్త్రీ గర్భంలో ధరించి పెంపొందించాల్సి ఉంటుంది. కానీ, భర్త చనిపోయిన లేదా విడిపోయిన మహిళల సందర్భంలో, ఆ మహిళ స్వయంగా తన బీజకణాన్ని అందించవలసి వస్తుందని చట్టం వివరిస్తోంది.
వివరాలు
కారణం ఎవరు :
ఈ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న లోపాల వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఫెర్టిలిటీ కేంద్రాల అత్యాశ, తమ రక్తం కాకపోయినా బిడ్డ కావాలనే మానసికత ఉన్న దంపతులు, మాతృత్వం అమ్ముతూ డబ్బుకోసం జీవితాన్ని రిస్క్ చేస్తున్న మహిళలు — ఇలా ప్రతి ఒక్క అంశం వెనుక ఒక ప్రత్యేక కోణం కనిపిస్తోంది. ప్రస్తుతం సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ కేంద్రం మాత్రమే అధికారికంగా వెలుగులోకి వచ్చింది. కానీ, ఇంకా చాలామంది ఈ వ్యవస్థను చట్టాన్ని ఉల్లంఘిస్తూ, గోప్యంగా, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ వ్యవహారాలపై సరైన చర్యలు లేకపోవడమే సమస్యగా నిలుస్తోంది.