#NewsBytesExplainer: త్రిభాషా విధానం ఏంటి?.. తమిళనాడు దానిని ఎందుకు వ్యతిరేకిస్తోంది?
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ విద్యా విధానం 2020లోని త్రిభాషా విధానం మరోసారి చర్చకు దారితీసింది.
ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం దీని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.
1986 నాటి విద్యా విధానానికి బదులుగా రూపొందించిన జాతీయ విద్యా విధానం 2020 త్రిభాషా విధానానికి ప్రాధాన్యతనిచ్చింది.
అయితే, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దే యత్నంగా భావించి దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
విధానం
త్రిభాషా విధానం ఏమిటి?
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం, విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి.
అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి, మూడోది అంతర్జాతీయ భాష కావచ్చు.
ఇది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా వర్తిస్తుంది.
అంతేకాకుండా, రాష్ట్రాలు భాషలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పొందుతాయి, అంటే హిందీని బలవంతంగా రుద్దే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
స్థానం
విదేశీ భాషలకు త్రిభాషా విధానంలో స్థానం
త్రిభాషా విధానం కేవలం భారతీయ భాషలకే పరిమితం కాకుండా, విదేశీ భాషలకు కూడా అవకాశాన్ని కల్పించింది.
మూడో భాషగా విద్యార్థులు ఇంగ్లీషుతో పాటు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి భాషలను నేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఇది వారికి విభిన్న దేశాల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి, అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సహాయపడుతుంది.
చరిత్ర
త్రిభాషా విధానం చరిత్ర
త్రిభాషా విధానం 1964-66 కొఠారి కమిషన్ ద్వారా ప్రతిపాదించబడింది. 1968లో, ఇందిరా గాంధీ హయాంలో జాతీయ విద్యా విధానం దీన్ని అధికారికంగా ఆమోదించింది. 1986 జాతీయ విద్యా విధానం త్రిభాషా సూత్రాన్ని బలోపేతం చేసింది. 1992లో, పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు దీనిని మరింత సవరించింది.
త్రిభాషా విధానం హిందీని తప్పనిసరి చేస్తుందా?
జాతీయ విద్యా విధానం 2020 హిందీని తప్పనిసరి చేయలేదని స్పష్టంగా పేర్కొంది.ఇందులో ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదని స్పష్టం చేసింది.మూడు భాషలలో రెండు భారతీయ భాషలు ఉండాలి,కానీ ఏ భాషలను నేర్చుకోవాలనేది విద్యార్థుల ఎంపికపై ఆధారపడి ఉంటుంది.1968 విద్యా విధానం హిందీని తప్పనిసరిగా పేర్కొనగా, 2020 విధానం భాషా స్వేచ్ఛను హామీ ఇస్తుంది.
వ్యతిరేకత
తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తోంది ?
తమిళనాడు ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తోంది.
తమిళనాడు ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టంగా ప్రకటించారు.
కేంద్రం నిధులు కావాలంటే త్రిభాషా విధానం అమలు చేయాల్సిందే అని ఒత్తిడి తెస్తున్నట్లు తమిళనాడు ఆరోపిస్తోంది.
చరిత్రపరంగా కూడా, తమిళనాడు హిందీని వ్యతిరేకిస్తూ నిరసనలు నిర్వహించిందనే చరిత్ర ఉంది. గతంలో కాంగ్రెస్ హయాంలోనూ ఇదే వివాదం చర్చనీయాంశమైంది.
ముగింపు
రాజకీయ వాదనలకు దారి
త్రిభాషా విధానం విద్యార్థులకు భిన్న భాషలను నేర్చుకునే అవకాశం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కానీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, దీన్ని హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నంగా భావించి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వాదనలకు దారి తీయొచ్చు.