
Sun TV : సన్ టీవీ విషయంలో మారన్ సోదరుల మధ్య వివాదం ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
మారన్ సోదరుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం తాజాగా తీవ్రమవుతోంది. సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్‌కు తన సోదరుడు, ఎంపీ దయానిధి మారన్ కు లీగల్ నోటీసులు పంపారు. అందులో, తండ్రి 2003లో మృతి చెందిన తర్వాత కళానిధి మారన్ సంస్థను తన నియంత్రణలోకి అక్రమంగా తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ నోటీసుల్లో కళానిధితో పాటు ఆయన భార్యతో పాటు మరో ఏడుగురు వ్యక్తులపైనా ఆరోపణలు చేశారు. కంపెనీలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు, ఉన్నతాధికారులు, ఆర్థిక సలహాదారులు కలిసి కుట్ర పన్ని సంస్థలో మెజారిటీ వాటాలను కైవసం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
వివరాలు
మొత్తం ఆస్తుల విలువ సుమారుగా రూ.30,289 కోట్లు
కళానిధి మారన్ 1965లో జన్మించారు. చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం అమెరికాలో ఎంబీఏ చేసిన ఆయన, ప్రస్తుతం మీడియా, టెలివిజన్, రేడియో, సినిమా నిర్మాణం, ఐపీఎల్ వంటి వ్యాపారాల్లో చురుగ్గా ఉన్నారు. అంచనా ప్రకారం ఆయనకు చెందిన మొత్తం ఆస్తుల విలువ సుమారుగా రూ.30,289 కోట్లుగా ఉంది. 2010లో కళానిధి మారన్ విమానయాన సంస్థ స్పైస్ జెట్‌లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేశారు. అయితే తరువాత ఆ వాటాలను కంపెనీ యజమానుల్లో ఒకరైన అజయ్ సింగ్‌కు తిరిగి విక్రయించారు. అయినప్పటికీ ఈ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి కళానిధికి ఇంకా చెల్లించాల్సిన మొత్తం కోర్టు పరిధిలో పరిష్కారానికి ఎదురుచూస్తోంది.
వివరాలు
కంపెనీలో మారన్, కరుణానిధి కుటుంబాలకు సమాన వాటాలు
2003 సెప్టెంబర్ నాటికి కంపెనీలో మారన్, కరుణానిధి కుటుంబాలకు సమాన వాటాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే తర్వాత జరిగిన షేర్ హోల్డింగ్ పునర్వ్యవస్థీకరణలో కళానిధి మారన్ సంస్థ పగ్గాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని దయానిధి ఆరోపిస్తున్నారు. కంపెనీ బోర్డు అనుమతి లేకుండానే కళానిధి మారన్ తన పేరిట అదనంగా 12 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించుకున్నారని దయానిధి అభియోగం. ఈ షేర్ల వలన ఆయనకు 2023 వరకు డివిడెండ్ రూపంలో రూ.5,926 కోట్లు లభించాయని, 2024 ఒక్క సంవత్సరంలోనే రూ.455 కోట్ల డివిడెండ్ వచ్చినట్లు తెలిపారు.
వివరాలు
సన్ టీవీ షేర్లు 4 శాతం పతనం
ఈ కుటుంబం మధ్య నెలకొన్న వివాదం ప్రభావంతో సన్ నెట్‌వర్క్ షేర్ల ధర మార్కెట్లో పడిపోయింది. నేడు ఇంట్రాడే ట్రేడింగ్‌లో సుమారుగా 4 శాతం షేర్లు దిగజారాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కో షేరు ధర రూ.598 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే, కంపెనీ తరపున ఈ వివాదం పూర్తిగా ప్రమోటర్ కుటుంబానికి మాత్రమే సంబంధించినదని స్పష్టంచేస్తూ, వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది.
వివరాలు
దయానిధి మారన్ డిమాండ్లు
తన లీగల్ నోటీసులో దయానిధి మారన్, సన్ టీవీ నెట్‌వర్క్ సహా అనుబంధ సంస్థల వాటాదారుల స్థితిని 2003 సెప్టెంబర్ 15 నాటికి ఉన్నట్లుగా పునరుద్ధరించాలని కోరారు. అదే సమయంలో అసలు యజమానులకు వాటాలను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పాటించకపోతే, చట్టపరంగా సివిల్, క్రిమినల్, రెగ్యులేటరీ, ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నోటీసులో హెచ్చరించారు.