Page Loader
Polavaram: పోలవరం మాన్యువల్‌ తుది రూపం ఎప్పటికి..? కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి!
పోలవరం మాన్యువల్‌ తుది రూపం ఎప్పటికి..? కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి!

Polavaram: పోలవరం మాన్యువల్‌ తుది రూపం ఎప్పటికి..? కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ నిపుణుల బృందం పలువురు కీలక సిఫార్సులు చేసినప్పటికీ, వాటి అమలులో మాత్రం స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు. కేంద్ర జలశక్తిశాఖ కూడా ఈ అంశంపై గట్టిగా పట్టుబడుతున్నా.. పనుల్లో చలనం కనిపించడంలేదు. ఇప్పటికే పాత డయాఫ్రం వాల్ ధ్వంసం కావడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. దాదాపు రూ.100 కోట్ల విలువైన గైడ్‌బండ్ కూడా దెబ్బతింది. ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ల నుంచి అనూహ్యంగా జరిగే సీపేజీ నీటి వల్ల భారీ నష్టం కలిగింది.

Details

కేవలం 30శాతం మాత్రమే పనులు

ఈ నీటిని తోడిపోసేందుకు ఇప్పుడు కొత్తగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త డయాఫ్రం వాల్ పనులు ప్రారంభమైన ఆరు నెలల కాలంలో కేవలం 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా, ఈ మధ్యే మూడో పక్ష నాణ్యత నియంత్రణ ఏజెన్సీ ఎంపిక పూర్తయింది. కానీ, మాన్యువల్ రూపకల్పన, ఆమోదం, అమలు వంటి కీలక ప్రక్రియలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

Details

ఆరు నెలల తర్వాత మూడో పక్షానికి బాధ్యతలు

ఇప్పటి వరకు ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పర్యవేక్షణ బాధ్యతలు గుత్తేదారు సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగాయి. అయితే కేంద్ర జలశక్తిశాఖ పర్యవేక్షణలో ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం, ఈ విధానం సరిపోవడం లేదని అభిప్రాయపడింది. ప్రత్యేక స్వతంత్ర నాణ్యత నియంత్రణ వ్యవస్థ అవసరమని స్పష్టంగా వెల్లడించింది. ప్రాజెక్టులో కీలకమైన ప్రతిదీ గుత్తేదారులచేతే రూపొందించబడుతోంది, అమలూ వారివే కావడం ఆందోళనకరమని సూచించింది. దీంతో మూడో పక్ష నియామకానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

Details

అంగీకరించిన కేంద్ర జలశక్తిశాఖ

తిరుపతి ఐఐటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లతో సంప్రదింపులు జరిగినా, కేంద్ర జలశక్తిశాఖ వీరిని అంగీకరించలేదు. చివరకు టెండర్ల ప్రక్రియ ద్వారా ఢిల్లీలోని 45 ఏళ్ల అనుభవం గల సంస్థ 'అడ్కో'ను ఎంపిక చేశారు. త్వరలోనే ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రాజెక్టు ప్రాంగణంలో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

Details

నాణ్యతా ప్రమాణాల ముసాయిదా మాత్రం ఆలస్యం

ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాలపై స్పష్టమైన ముసాయిదా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై కేంద్ర జలశక్తిశాఖ, కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ, ఏపీ జలవనరులశాఖ వంటి సంస్థలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే అఫ్రి రూపొందించిన ముసాయిదాపై కొన్ని సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి, నాణ్యతపై ఎవరి పాత్ర ఏంటి? ఎలాంటి పరీక్షలు అవసరం? పనికి బాధ్యుడెవరు? వంటి అంశాలన్నీ ముందుగానే స్పష్టతతో మాన్యువల్‌లో పొందుపరచాల్సిన అవసరం ఉందని గతంలోనే సిఫార్సులు చేశారు. అంతేగాక, మూడో పక్షం ఏర్పాటు చేయబోయే ల్యాబ్ స్వతంత్రంగా ఉండాలని కూడా స్పష్టం చేశారు.