Delhi Election Analysis: దిల్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ ఎవరు?.. ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవేనా!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి షాకిచ్చింది.
దాదాపు 26 సంవత్సరాల విరామం తర్వాత బీజేపీ దిల్లీలో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకుంది.
ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని సూచించగా, ఫలితాలు ఆ అంచనాలను నిజం చేస్తున్నాయి.
దాదాపు 27 సంవత్సరాల క్రితం బీజేపీ నేత సుష్మా స్వరాజ్ 52 రోజుల పాటు దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత అతిషి దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
Details
కేజ్రీవాల్ రాజీనామా అనంతరం మారిన రాజకీయాలు
కేజ్రీవాల్ రాజీనామా అనంతరం, ఎన్నికల హవా మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంతో పాటు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించారు.
అయితే ఆప్ ఓటమికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవే ఆప్ విజయ అవకాశాలను దెబ్బతీసిన అంశాలుగా అంచనా వేస్తున్నారు. మరి అవేంటో చూద్దాం!
Details
అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం
అరవింద్ కేజ్రీవాల్ మూడు సార్లు దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నప్పటికీ, అవినీతి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
దిల్లీ మద్యం విధానానికి సంబంధించి జరిగిన కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్టయి జైలుకు వెళ్లారు.
మొదట్లో సీఎం పదవికి రాజీనామా చేయకుండా కొనసాగినా, చివరికి 2023 సెప్టెంబర్‌లో పదవి నుంచి తప్పుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు సత్యేందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మద్యం పాలసీ కేసులో, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్, అదే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది.
Details
ఉచిత పథకాలపై బీజేపీ కౌంటర్
ఆప్ ఎన్నికల ప్రచారంలో ఉచిత పథకాలు కీలక పాత్ర పోషించాయి. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ప్రజల్లో ఆదరణ పొందాయి.
అయితే బీజేపీ ఈసారి అదే వ్యూహాన్ని అనుసరించింది.
ఉచిత పథకాల వ్యతిరేకంగా ముందుగా ఉన్నా గర్భిణులకు ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, వృద్ధులకు రూ. 2500 పెన్షన్, ఆయుష్మాన్ భారత్, అటల్ క్యాంటీన్లలో రూ. 5కే భోజనం వంటి పథకాలను ప్రకటించింది.
కాంగ్రెస్ కూడా భారీ హామీలు ఇచ్చింది. ఫలితంగా, ఆప్ ఉచిత పథకాల వ్యూహం పనిచేయలేదు.
Details
శీష్ మహల్ వివాదం
దిల్లీ సీఎం నివాస నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడాన్ని బీజేపీ ప్రధానంగా ఎత్తిచూపింది.
కేజ్రీవాల్ కోసం అతి ఖరీదైన ఇంటిని నిర్మించడం ఆప్ ప్రభుత్వానికి భారీ ప్రతికూలతను తీసుకువచ్చింది.
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ ఈ విషయాన్ని ప్రచారంలో బలంగా వినిపించాయి. ప్రధాని మోదీ సహా అనేక మంది బీజేపీ నేతలు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించి, ఆప్‌ను కౌంటర్ చేశారు.
Details
యమున నది కాలుష్యం
దిల్లీ ప్రజలకు శుద్ధమైన నీరు అందించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది.
గతంలో కేజ్రీవాల్ యమున నది శుద్ధీకరణపై హామీలు ఇచ్చినా, పదేళ్ల పాలనలో అనుకున్న స్థాయిలో పనులు జరగలేదు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. యమునా నదిని తాను శుద్ధం చేశానని, కేజ్రీవాల్ తన మంత్రులతో కలిసి ఆ నదిలో స్నానం చేస్తారా అని ప్రశ్నించారు.
కేజ్రీవాల్ దీనికి హర్యానా ప్రభుత్వమే కారణమని సమాధానమిచ్చినా, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ యమునా నీటిని తాగి నిరూపించారని వార్తలు వచ్చాయి.
ఈ వివాదం ఎన్నికల ముందు ఆప్‌కు ఇబ్బందికరంగా మారింది.
Details
బీజేపీ వ్యూహం ఫలించిన తీరు
బీజేపీ ఈసారి దిల్లీలో గెలుపును లక్ష్యంగా పెట్టుకుని, ఆమ్ ఆద్మీ పార్టీని అన్ని విధాలుగా టార్గెట్ చేసింది.
"ఆమ్ ఆద్మీ డిజాస్టర్" అనే నినాదాన్ని ప్రచారంలో తెరపైకి తీసుకువచ్చింది.
ప్రధాని మోదీ స్వయంగా ఆప్ ప్రభుత్వాన్ని డిజాస్టర్‌గా అభివర్ణించారు.
దిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించింది.
Details
కాంగ్రెస్ ప్రభావం - ఆప్ ఓటింగ్ శాతం తగ్గుదల
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. 2015లో 9.7% ఓట్లు సాధించిన కాంగ్రెస్, 2020లో 4.3%కు పడిపోయింది.
అయితే ఈసారి స్వల్పంగా పెరిగి 6.62%కి చేరింది. దీంతో ఆప్ ఓట్ల శాతం కొంత మేర తగ్గినట్లు కనిపిస్తోంది.
గతంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగా, ఈసారి ఇద్దరూ విడివిడిగా పోటీ చేయడం ఆప్ విజయ అవకాశాలను దెబ్బతీసిన అంశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అవినీతి ఆరోపణలు, బీజేపీ వ్యూహాత్మక కౌంటర్లు, ఉచిత పథకాల పోటీ, కాంగ్రెస్ ప్రభావం, శీష్ మహల్ వివాదం, యమునా నది సమస్యలు ప్రధాన కారణాలుగా మారాయి.