LOADING...
Attack on Delhi CM: దిల్లీ సీఎంపై దాడి కేసు.. నిందితుడు ఎవరంటే?
దిల్లీ సీఎంపై దాడి కేసు.. నిందితుడు ఎవరంటే?

Attack on Delhi CM: దిల్లీ సీఎంపై దాడి కేసు.. నిందితుడు ఎవరంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఒక వ్యక్తి చేసిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈఘటన అనంతరం పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌కు చెందిన 41ఏళ్ల రాజేశ్‌ భాయ్‌ ఖిమ్జీ భాయ్‌ సకారియాగా గుర్తించారు. అతడి నేపథ్యంపై గుజరాత్‌లోనూ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టగా,దాడి వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటో కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. దీనిలో భాగంగా అతడి కుటుంబసభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు.సకారియా సీఎం రేఖా గుప్తాపై ఎందుకు దాడి చేశాడనే అంశంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. నిందితుడి బంధువు జైలులో ఉండటంతో,అతడి విడుదల కోసం ముఖ్యమంత్రి వద్దకు వినతి పెట్టేందుకు అధికారిక నివాసానికి వెళ్లాడని వార్తలు వెలువడ్డాయి.

వివరాలు 

సకారియా జంతు ప్రేమికుడు 

ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలోనే ఉందని జాతీయ మాధ్యమాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయాలను పోలీసులు ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఇక మరోవైపు, గుజరాత్‌లో సకారియా తల్లిని విచారించిన పోలీసులు ఆమె వద్ద నుంచి కొన్ని వివరాలు సేకరించారు. కుమారుడు దిల్లీ సీఎంను కలవడానికి వెళ్ళాడనే విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్లు సమాచారం. తన కుమారుడు జంతు ప్రేమికుడని,ఇటీవల వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాక, అతడి మానసిక స్థితి స్థిరంగా ఉండదని, గతంలో కూడా ఒకసారి దిల్లీకి వెళ్లి వచ్చాడని ఆమె వివరించినట్లు తెలిసింది.

వివరాలు 

'జన్ సున్‌వాయ్' కార్యక్రమంలో దాడి

ఈ క్రమంలో, బుధవారం ఉదయం దిల్లీ సివిల్‌ లైన్స్‌లోని సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న 'జన్ సున్‌వాయ్' కార్యక్రమంలోనే ఈ దాడి జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. సకారియా మొదట కొన్ని పత్రాలను సీఎంకు అందించి, అనంతరం గట్టిగా అరుస్తూ ఆకస్మికంగా ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనపై రాజకీయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా భాజపా సహా ప్రతిపక్ష పార్టీలు ఈ దాడిని ఘాటుగా ఖండించాయి.