బీజేపీ పాలిత రాష్ట్రాలు కులగణన ఎందుకు చేయట్లేదు?: జైరాం రమేష్
దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ సర్కార్ కులగణన చేపడుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే రమేష్ ఈ అంశంపై మాట్లాడారు. సామాజిక న్యాయం, హక్కుల కోసం చేపట్టే కులగణన ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌లో భారత జోడో యాత్ర జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అనేక కుల సంఘాల సభ్యులు కలిసి ఈ అంశాన్ని విన్నించారని, వారు వినతిని రాహుల్ సీరియస్‌గా తీసుకున్నారని చెప్పారు.
దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలి
కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీజేపీని డిమాండ్ చేస్తోందని, దేశంలో బిహార్ తర్వాత కులాల సర్వే నిర్వహించనున్న రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుందని జైరాం రమేష్ వెల్లడించారు. ఇక విపక్షాల కూటమి 'ఇండియా' కూడా దీన్నే ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు వెళుతుందన్నారు. స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా కుల గణనను చేపట్టాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది స్వాగతించాల్సిన విషయమని జైరాం రమేష్ వివరించారు.