కేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా (Canada) మధ్య మొదలైన వివాదం నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో ఖలిస్తానీ (Khalistani) ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగినట్లు అమెరికా గుర్తించింది. ఈ హత్యకు భారత్ నుంచి కుట్ర జరిగినట్లు అమెరికా ఆరోపించింది. అయితే గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర, నిజ్జర్ హత్యకు సంబంధించిన దర్యాప్తుపై కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ (Sanjay Kumar Verma) స్పందించారు. అమెరికా (US) దర్యాప్తుకు భారత్ సహకరిస్తోందని సంజయ్ కుమార్ చెప్పారు. అయితే నిజ్జర్ హత్య విచారణకు మాత్రం తాము సహకరించేది లేదని తేల్చి చెప్పారు.
అమెరికా ఆధారాలు సమర్పించింది: భారత రాయబారి
నిజ్జర్ హత్య విషయంలో కెనడా నేరుగా భారత ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా అభియోగాలు మోపిందని సంజయ్ కుమార్ చెప్పారు. అయితే గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో మాత్రం అమెరికా తమ ప్రభుత్వాన్ని కాకుండా, భారత్ లోని కొందరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లు, ఉగ్రవాదులతో భారత్‌కు చెందిన కొన్ని ముఠాలతో సంబంధం ఉందని అమెరికా తమకు ఆధారాలు సమర్పించినట్లు సంజయ్ కుమార్ వెల్లడించారు. అందుకే తాము అమెరికా దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు చెప్పారు. నిజ్జర్ హత్య విషయంలో కెడనా తమకు ఇలాంటి ఆధారాలు తమకు సమర్పించలేదన్నారు.