LOADING...
Indian Army: భారత సైన్యంలో విప్లవాత్మక మార్పులు.. 'రుద్ర బ్రిగేడ్', 'భైరవ కమాండో బెటాలియన్‌లు'
'రుద్ర బ్రిగేడ్', 'భైరవ కమాండో బెటాలియన్‌లు'

Indian Army: భారత సైన్యంలో విప్లవాత్మక మార్పులు.. 'రుద్ర బ్రిగేడ్', 'భైరవ కమాండో బెటాలియన్‌లు'

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యంలో రాబోతున్న కీలకమైన మార్పులకు రుద్ర ఆల్‌ ఆర్మ్స్‌ బ్రిగేడ్‌, భైరవ లైట్‌ కమాండో బెటాలియన్లు స్పష్టమైన సంకేతాలు. ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో సైనికులతో ఒకే రకమైన ఆయుధాలతో యుద్ధం చేయడం జరుగుతున్నా, ఇప్పుడు తక్కువ మందితో విభిన్నమైన ఆయుధాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒకేసారి శత్రువుపై సమిష్టిగా దాడి చేసే విధానానికి మారింది. చైనా, పాకిస్థాన్‌లతో గతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో భారత సైన్యంలో వేగంగా అమలవుతున్న ఈ మార్పులు చారిత్రాత్మకంగా పేర్కొనవచ్చు.

వివరాలు 

బిపిన్‌ రావత్‌ హయాంలో నాంది.. 

సీనియర్ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS)గా సేవలందించిన దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ హయాంలోనే ఈ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే 'ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌' (IBG)ల ఏర్పాటు అంశం చర్చలకు వచ్చింది. ఈ గ్రూపుల్లో కాలినాళ్ల దళాలతోపాటు శతఘ్ని, రాకెట్‌ వ్యవస్థలు, కవచిత వాహనాలు, వాయు రక్షణ విభాగాలు, కమ్యూనికేషన్‌ బలగాలు మొదలైనవి ఉంటాయి. ఇవి సాధారణ బ్రిగేడ్‌ (సుమారు 3,000 సైనికులు) కన్నా పెద్దగా, కానీ డివిజన్‌ (10,000 మంది సైనికులు) కన్నా చిన్న పరిమాణంలో ఉంటాయి. మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారిని నేతృత్వంలో పనిచేస్తూ, అవసరమైన నిర్ణయాలను వేగంగా తీసుకోగల సామర్థ్యం వీటికి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో 12 నుండి 48 గంటల వ్యవధిలో అవసరమైన ప్రదేశాలకు మోహరించగలగడం వీటి ప్రత్యేకత.

వివరాలు 

గత అనుభవాల నేపథ్యం 

సైనిక చర్యలు చేపట్టాలంటే పదాతి దళాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని శతఘ్ని, సాయుధ వాహనాలు, సిగ్నల్స్‌,ఎయిర్‌ డిఫెన్స్‌ ఇలా పలు యూనిట్లను సిద్ధం చేసుకోవడానికి.. వాటిని సరిహద్దులకు చేర్చడానికి రెండు మూడు వారాల నుంచి నెలల సమయం పడుతోంది. ఉదాహరణకు 2001-02లో జరిగిన ఆపరేషన్‌ పరాక్రమ్‌ సమయంలో ఈ విధంగా జాప్యం చోటుచేసుకుంది. శత్రువు మన కదలికలను ముందుగానే గమనించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, బ్రిగేడ్‌ స్థాయిలోనే అన్ని రకాల వనరులను సమీకరించి ముందుగానే సిద్ధంగా ఉంచే పద్ధతిని అనుసరించాలని ప్రతిపాదించారు.

వివరాలు 

ఏమిటీ రుద్ర బ్రిగేడ్‌..? 

ప్రస్తుతం ఉన్న రెండు కాలినాళ్ల బ్రిగేడ్లను'రుద్ర'గా మార్చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇవి మెకనైజ్డ్‌ఇన్‌ఫాంట్రీ,ట్యాంకులు, శతఘ్ని యంత్రాలు, ప్రత్యేక దళాలు, మానవ రహిత విమానాలు (డ్రోన్లు),ప్రత్యేకమైన లాజిస్టిక్స్‌ వ్యవస్థలతో పాటు సమర్థవంతమైన కాంబాట్‌ సపోర్ట్‌తో కూడి ఉంటాయి. రుద్ర బ్రిగేడ్‌లు మోహరించే ప్రాంతాల భౌగోళిక లక్షణాలు,అక్కడ చేపట్టే ఆపరేషన్‌ల స్వభావాన్ని బట్టి వీటిలో ఉండే బలగాల సమ్మేళనం మారుతూ ఉంటుంది. వీటిలో శతఘ్ని,డ్రోన్ల నిఘా వ్యవస్థలు ఉన్నందున, ఇది మన సైన్యానికి స్పష్టమైన ఆధిపత్యాన్ని కలిగిస్తుంది. ఉగ్రవాద దాడులు,పాకిస్తాన్‌ వంటి దేశాల దూకుడు చర్యలకు తక్షణమే కౌంటర్‌గా స్పందించడంలో ఇవి కీలకంగా మారతాయి. ముఖ్యంగా పంజాబ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఈబ్రిగేడ్లను మోహరించవచ్చు. పాక్‌ దుందుడుకు చర్యలకు వెంటనే సమాధానం చెప్పొచ్చు.

వివరాలు 

భైరవ లైట్‌ కమాండో బెటాలియన్లు ఏమిటీ..? 

భైరవ లైట్‌ కమాండో బెటాలియన్‌లు సరిహద్దుల్లో వేగంగా మోహరించేందుకు, మెరుపుదాడుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇవి తక్షణమే స్పందించగల టాక్టికల్‌ ఆపరేషన్‌లపై దృష్టి పెడతాయి. సైనిక చర్యలకు వీటిని ఎప్పుడైనా సిద్ధంగా ఉంచే విధంగా తయారుచేశారు. ఇవి అత్యంత వేగంగా, ఖచ్చితంగా ప్రదర్శించే సామర్థ్యం గలవిగా రూపొందించబడ్డాయి. 2001-02లో జరిగిన ఆపరేషన్‌ పరాక్రమ్‌ తరువాత భారతదేశం వేగంగా బలగాల మోహరణపై దృష్టి పెట్టింది. అప్పట్లోనే 'కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌' అనే సిద్ధాంతం పై పరిశీలన మొదలైంది. అదే దిశగా ఐబీజీ ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి.

వివరాలు 

భవిష్యత్తు యుద్ధాలకై భారత సిద్ధత 

భవిష్యత్తులో జరిగే ఆధునిక యుద్ధాలకు భారత సైన్యం ఇప్పటికే సిద్ధమవుతోంది. డ్రోన్‌ ప్లాటూన్లతో పాటు, గాల్లో తిరుగుతూ లక్ష్యాలను గుర్తించి దాడిచేసే 'లాయిటరింగ్‌ అమ్యునిషన్‌', శతఘ్ని రెజిమెంట్లు వంటి సాంకేతిక సన్నద్ధతను 'దివ్యాస్త్ర ప్రోగ్రామ్‌' పేరిట ముందుకు తీసుకువెళ్తోంది. దీనితో పాటు ప్రతిపాదిత ఐబీజీలు, ఇప్పటికే ప్రారంభమైన రుద్ర,భైరవ యూనిట్లు భవిష్యత్తులో మెరుపు వేగంతో ప్రతిదాడికి శత్రువును ఎదుర్కొనేలా రూపొందించబడ్డాయి.