గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ, గురువారం రాజ్యసభలో కూడా మాటల తూటాలను పేల్చారు. గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే ఎందుకు భయం అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. నెహ్రూ ఇంటి పేరును ఎందుకు పెట్టుకోలేదన్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ అన్ని చోట్లా సమస్యలు సృష్టించిందని ప్రధాని మోదీ విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కాంగ్రెస్ ఎన్నడూ పరిష్కారం చూపలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా బీజేపీ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంపై దృష్టి సారించిందని చెప్పారు.
బీజేపీని ఎంత విమర్శిస్తే, కమలం అంత వికసిస్తుంది: ప్రధాని మోదీ
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరపాలని ప్రతిపక్షాలు నినాదాలు చేస్తున్న సమయంలో.. బీజేపీని ఎంత విమర్శిస్తే, కమలం అంత వికసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీదే నిజమైన సెక్యులరిజమని మోదీ ప్రకటించారు. 600లకు పైగా ప్రభుత్వ పథకాలకు గాంధీ-నెహ్రూ కుటుంబీకుల పేర్లు పెట్టారని ఓ వార్తాపత్రిక కథనాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ప్రతిపక్షాలు సాంకేతికతకు వ్యతిరేకమని, వారి ప్రాధాన్యత రాజకీయాలే తప్ప అభివృద్ధి కాదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశ గతిని మార్చిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అనేక విజయాలను సాధించినట్లు మోదీ పేర్కొన్నారు.