
Chandra Babu: అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా : సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో మూడు సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 300 ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అప్పట్లో ఇంజినీరింగ్ కాలేజీల పెరుగుదలపై విమర్శలు వచ్చినప్పటికీ, తన దృష్టిలో ఇది పెద్ద ప్రతిఫలంగా నిలిచిందని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కారణం తన హయాంలో తీసుకొచ్చిన ఐటీ విప్లవమేనని స్పష్టం చేశారు. హైటెక్ సిటీ ఏర్పాటు ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించామని, తెలుగు యువత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ప్రముఖులుగా ఎదిగారని చెప్పారు.
Details
2019లో అమరావతి నిర్మాణం ఆగిపోయింది
సింగపూర్ ప్రజల అభివృద్ధిపట్ల ఉన్న ఉత్సాహం, ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. 2019లో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు రాష్ట్ర అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. ఈ కారణంగా రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఏపీని హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 2014లో అమరావతిని సింగపూర్ లా తయారు చేస్తానని ఇచ్చిన హామీని మరోసారి గుర్తు చేశారు. అలాగే, 2047 నాటికి భారత్ యువజనశక్తి పరంగా అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుందని, భారతీయులు ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.