చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే
చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం కోసం ఒక్క భారత్ మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చంద్రయాన్-3 మిషన్ చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ తర్వాత చంద్రుడుపై భూగర్భం, పర్యావరణాన్ని అన్వేషించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుడిపై విజయవంతంగా దిగేందుకు భారత్ చేస్తున్న రెండో ప్రయత్నం ఇది. ప్రయోగం శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు షెడ్యూల్ చేయబడింది. ప్రస్తుతం ల్యాండర్, రోవర్‌తో సహా అంతరిక్ష నౌకను ప్రొపల్షన్ మాడ్యూల్‌పై ఉంచి, ప్రయోగాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచారు.
చంద్రయాన్ -2 చివరి దశలో విఫలమైంది: ఇస్రో చీఫ్
చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో చీఫ్, ఎస్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ -2 మిషన్ చిన్న, చిన్న కారణాలతో చివరి దశలో విఫలమైందని సోమనాథ్ వివరించారు. అయితే ఇప్పుడు ఆ సమస్యలను గుర్తించి, అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. అధిక వేగంతో ల్యాండ్ అయ్యే వ్యోమనౌక సామర్థ్యాన్ని, మెరుగైన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇస్రో పెంపొందించినట్లు సోమనాథ్ వెల్లడించారు. అదనపు సెన్సార్ల వల్ల ఒత్తిడి, భ్రమణాలను నియంత్రించే సామర్థ్యాన్ని బలోపేతం చేసినట్లు వెల్లడించారు.
చంద్రయాన్-3 లాంచ్‌కు ప్రధాని మోదీ రాకపై సోమనాథ్ ఏం అన్నారంటే?
చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారా అనే ప్రశ్నకు సోమనాథ్ ఇలా స్పందించారు. అందరికీ ఆహ్వానాలను పంపుతున్నామని, ప్రధాని మోదీ వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో చంద్రయాన్-2 మిషన్ ప్రయోగాన్ని ప్రధాని మోదీ ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే అది విఫలం కావడంతో ఆ సమయంలో కన్నీళ్లపర్యంతమైన అప్పటి ఇస్రో చీఫ్ కె శివన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్చారు. చంద్రయాన్-3 మిషన్, జూలై 14న ప్రయోగించబడితే, 45 రోజులకు పైగా అంతరిక్షంలో ప్రయాణించి, ఆగస్టు చివరి నాటికి అది చంద్రున్ని చేరుకుంటుంది.