Kishanreddy: జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు: కిషన్ రెడ్డి
కేంద్రం విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాలకు సహాయం అందిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని, బాధితులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు వచ్చి సమీక్ష చేస్తాయని తెలిపారు. 11 జిల్లాల్లో వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని కేంద్రమంత్రి విచారం వ్యక్తంచేశారు. వర్షాలు, వరదల వల్ల ఆస్తి, పంట నష్టాలు భారీగా చోటు చేసుకున్నాయన్నారు. వరద ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడారని పేర్కొన్నారు.
ముంపు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు ఆహారం,తాగునీరు
వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని చెప్పారు. ఏపీ, తెలంగాణలో పరిస్థితులపై కేంద్రం సకాలంలో సమీక్ష చేస్తుందని, ప్రధాన మంత్రి కార్యాలయం దెబ్బతిన్న జాతీయ రహదారులను మరమ్మత్తు చేయాలని ఆదేశించిందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం సమయంలో విమర్శలు చేయకుండా అందరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్రమంత్రి కోరారు. బీజేపీ శ్రేణులు ముంపు ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు అందిస్తున్నాయని చెప్పారు.
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా
రాష్ట్ర ప్రభుత్వ వద్ద రూ.1345 కోట్ల డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉందని, ఆ ఫండ్‌ని ఉపయోగించి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. అవసరమైతే, తాత్కాలికంగా కేంద్రం నుంచి నిధులు అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, రాష్ట్ర సర్కార్ రూ.5 లక్షలు ప్రకటించిన విషయంపై సందేహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులు కలుపుకుని సీఎం రూ.5 లక్షలు ప్రకటించారేమో మరి తెలియదని వ్యాఖ్యానించారు. అంటువ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ప్రధాన మంత్రి పర్యటన చేస్తారని, జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.