Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని, మళ్లీ ప్రజా తీర్పు కోరతానని ఆయన ఆప్ కార్యకర్తల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం కేజ్రీవాల్ వ్యాఖ్యలు దిల్లీ రాజకీయాల్లో హీట్ పుట్టించాయి. ఇటీవలే కేజ్రీవాల్ బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.
కొద్ది రోజుల్లో కొత్త సీఎం ఎంపిక
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నామని, ఇందుకోసం రెండు, మూడు రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. ఆప్‌లో చీలికలు తెచ్చి దిల్లీలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నించి, విఫలమైందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనను జైల్లో పెట్టి పార్టీని కుదేల చేయాలనుకున్నారని, అయినా తమ పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయారన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే బాధ్యతతోనే ఇన్నాళ్లూ రాజీనామా చేయలేదని కేజ్రీవాల్ అన్నారు.
నిజాయితే విజయం సాధించింది
సుప్రీంకోర్టు కూడా తన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపవచ్చని తేల్చిచెప్పిందని ఆయన అన్నారు. మద్యం విధానం సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఆరు నెలల తర్వాత తిహాడ్ జైలు కేజ్రీవాల్ విడుదలయ్యారు. చివరికి నిజాయితే విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. దేశాన్ని విభజిస్తున్న శక్తులపై తన పోరాటం కొనసాగుతుందని కూడా తెలిపారు.