Winter Session Of Parliament : డిసెంబర్ తొలి వారంలో పార్లమెంట్ సమావేశాలు.. డీలిమిటేషన్‌పై కీలక చర్చ!
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై రాజకీయ వేడి పెరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై తీవ్ర విమర్శలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయి. వీటిని నియోజకవర్గాల పునర్విభజన ద్వారా గరిష్ఠంగా 850కి పెంచాలని ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
వివరాలు
బిల్లులకు అవసరమైన మెజారిటీ లభిస్తుందా?
ఈ బిల్లు ఆమోదం పొందితే 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర శాసనసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ప్రభుత్వంలోని కీలక వర్గాలతో చర్చించిన అనంతరం డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పీటీఐకి వెల్లడించాయి.
అయితే,ఈ కీలక బిల్లులను ఆమోదింపజేయడం మోదీ ప్రభుత్వానికి అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి.
మొత్తం 543 స్థానాల్లో కనీసం 361 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో సభలో సభ్యుల సంఖ్య 540గా ఉంది.
వివరాలు
అధికార ఎన్డీయే కూటమికి 320 మంది ఎంపీల బలం
అధికార ఎన్డీయే కూటమికి 320 మంది ఎంపీల బలం మాత్రమే ఉంది.
ఈ లెక్కల ప్రకారం బిల్లు ఆమోదం పొందాలంటే ప్రతిపక్షాల మద్దతు కూడా కీలకం కానుంది.
మరోవైపు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా విపక్షాలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నిరసనలను పార్లమెంట్‌లోనూ కొనసాగించే అవకాశముండటంతో సమావేశాల్లో గందరగోళం నెలకొనవచ్చని అంచనా వేస్తున్నారు.
సభ సజావుగా సాగితేనే రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ నిర్వహించడం సాధ్యమవుతుందని అధికార కూటమికి చెందిన ఓ ఎంపీ అభిప్రాయపడినట్లు సమాచారం.
అయితే, బిల్లుకు అవసరమైన మద్దతు లభిస్తుందనే విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ప్రొరోగ్ చేయకుండానే కొనసాగింపు!
ఈ బిల్లు 15 నుంచి 18 ఓట్ల ఆధిక్యంతో ఆమోదం పొందుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను ప్రభుత్వం అధికారికంగా ప్రొరోగ్ చేయకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
అయితే, వాటిని అధికారికంగా ముగించకపోవడంతో ఇప్పటికే 94రోజులు గడిచాయి. 2008లో నమోదైన 87 రోజుల రికార్డును కూడా ఇది అధిగమించింది.
ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా అవసరమైతే ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశాలనే పొడిగించవచ్చు.
లేదా ప్రత్యేకంగా సమావేశమై రాజ్యాంగ సవరణ బిల్లును తక్కువ సమయంలోనే చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
అయితే, ఇప్పటికే కొనసాగుతున్న సమావేశాలను పొడిగించాలంటే కనీసం రెండు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
వివరాలు
అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు?
కొత్తగా సమావేశాలు నిర్వహించాలంటే మాత్రం కనీసం 14 రోజుల ముందుగానే నోటీసు జారీ చేయాలి.
డీలిమిటేషన్ అంశంపై ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ ఆందోళనలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే 50శాతం చొప్పున పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అదే సమయంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ స్థానాల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించే ఫార్ములాను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఈ ఏడాది ఏప్రిల్ 17న రాజ్యాంగ సవరణ బిల్లు
అయితే, ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ 17న నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
అయితే, అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందలేదు.
దీంతో ఇప్పుడు జరగనున్న శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు భవితవ్యం కేంద్ర ప్రభుత్వానికి కీలక రాజకీయ, శాసనపరమైన పరీక్షగా మారనుంది.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత వాటిని ఎన్ని రోజుల్లోగా అధికారికంగా ప్రొరోగ్ చేయాలనే అంశంపై రాజ్యాంగంలో నిర్దిష్ట కాలపరిమితి లేదు.
ఈ వెసులుబాటును ఉపయోగించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.