మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమిలో భిన్న వాదనలు.. ఎవరెమన్నారో తెలుసా
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023పై విపక్షాల కూటమి 'ఇండియా'లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు బిల్లుకు కాంగ్రెస్ యథాతథంగా ఆమోదం తెలుపుతుండగా, మరోవైపు బిహార్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఆర్జేడీ, జేడీయూలు మార్పులు కోరుతున్నాయి. ఈ మేరకు కూటమిలో భిన్నవాదనలకు తెరలేపాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఉద్దేశం ఏమిటో మరింత స్పష్టతనివ్వాలని కోరుతున్నాయి. మహిళలకు రాజకీయ ప్రాతినిథ్యం ఇవ్వాలన్నదే మీ ఆలోచన అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఇస్తేనే పూర్తి న్యాయం జరిగినట్టని ఆ పార్టీలు సూచిస్తున్నాయి. ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ పెద్ద ఎత్తుగడే వేసిందని పేర్కొన్నాయి. ఈ బిల్లుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పూర్తి మద్దతిస్తుండగా, జేడీయూ, ఆర్జేడీలు ఎస్సీ,ఎస్టీలతో పాటే బీసీ మహిళకూ రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.
సబ్ కోటా తప్పనిసరిగా ఉండాలంటున్న జార్ఖండ్ ముక్తి మోర్చా
కొత్త పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చ జరగనుంది. ఈ రిజర్వేషన్ లోను సబ్ కోటా ఇవ్వాలని ఆయా పార్టీ అధినేతలు నితీష్, లాలూ భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి సబ్‌కోటాల కింద మహిళలు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో ఇండియా కూటమిలో భిన్నవాదనలు, పరస్పర విరుద్ధర వైఖరి కనిపిస్తోంది. కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్, సబ్-కోటా రిజర్వేషన్ ను కోరకపోవడం గమనార్హం. తాము ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న బిల్లు వస్తున్నందున స్వాగతిస్తున్నామని, కానీ సబ్ కోటా తప్పనిసరిగా ఉండాలని జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీ మహువా మాజీ అన్నారు. లేనిపక్షంలో ఎగువ తరగతి మహిళలే, రిజర్వేషన్ ప్రయోజనాలను అందుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు.
సబ్ కోటాకు డిమాండ్ చేస్తున్న బిహార్ సీఎం, ఝార్ఖండ్ సీఎంలు
ఈ బిల్లుకు అనుకూలంగా ఉన్న వారెవరు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి.ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. మోదీ మంత్రివర్గం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మద్దతు పలికారు. అనుకూలంగా లేని వారెవరు : ప్రత్యేకించి ఎస్సీ,ఎస్టీలతో పాటు బీసీ మహిళలకూ సబ్ కోటా వర్తింపజేయాలని రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, జార్ఖండ్ ముక్తి మోర్చా పట్టుబడుతున్నాయి.ఈ మేరకు బిల్లుకు మద్దతిచ్చే అవకాశాలు లేవని సమాచారం. కోటాలో ఉపకోటా అంశం కూటమిలో చీలికకు తెరలేపడంపై చర్చ జరుగుతుండటం గమనార్హం. కాంగ్రెస్ సహా 28 పార్టీలు ఇటీవలే ఇండియా కూటమి పేరిట ఏకమయ్యాయి.