Page Loader
CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా
'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదవీకాలం ఈ రోజు ముగిసింది. సుప్రీంకోర్టులో ఆయన చివరి రోజు బెంచ్‌ కార్యకలాపాలు పూర్తయ్యాక నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్‌ ఖన్నా మీడియాతో మాట్లాడారు. ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే,న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న అంశాల్లో మాత్రమే పనిచేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆయన పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రత్యేకంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. జస్టిస్‌ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా గత సంవత్సరం నవంబర్‌ 11న బాధ్యతలు స్వీకరించారు.

వివరాలు 

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. జస్టిస్‌ హెచ్‌.ఆర్‌. ఖన్నాకు సన్నిహిత బంధువు

ఆయన దివంగత న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఆర్‌. ఖన్నాకు సన్నిహిత బంధువు. 2005లో ఢిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఖన్నా, తర్వాతి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, 2023 నవంబర్‌ 11న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తరువాతి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ నియమితులయ్యారు. ఆయన మే 14న భారత 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.

వివరాలు 

నవంబర్‌ 23న పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ గవాయ్‌

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. జస్టిస్‌ గవాయ్‌ తన తర్వాత సీనియారిటీ కలిగిన న్యాయమూర్తిగా ఉండటంతో, ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఖన్నా ఆయన పేరును ప్రభుత్వం వద్ద సిఫార్సు చేశారు. దీనిని ప్రభుత్వం ఆమోదించింది. జస్టిస్‌ గవాయ్‌ సుమారు ఆరు నెలల పాటు సీజేఐగా సేవలందించి ఈ ఏడాది నవంబర్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు.