Page Loader
Gamma Ray Telescope: లద్దాఖ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గామా రే టెలిస్కోప్.. ఇక్కడే ఎందుకంటే..?
లద్దాఖ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గామా రే టెలిస్కోప్

Gamma Ray Telescope: లద్దాఖ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గామా రే టెలిస్కోప్.. ఇక్కడే ఎందుకంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియాలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్‌ను లద్దాఖ్‌లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన టెలిస్కోప్ కావడం విశేషం. 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న హాన్లే ప్రాంతంలో ఈ పెద్ద ఇమేజింగ్ చెరెన్‌కోవ్ టెలిస్కోప్‌ను ప్రారంభించారు. ఈ టెలిస్కోప్‌ను మేజర్ అట్మాస్పియరిక్ చెరెన్‌కోవ్ ఎక్స్‌పరిమెంట్‌ (MACE) అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని ఇతర టెలిస్కోప్‌లతో పోలిస్తే అత్యంత ఎత్తులో ఉంది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC), ఈసీఐఎల్‌, ఇతర పారిశ్రామిక సంస్థల సహకారంతో ఈ టెలిస్కోప్‌ను దేశీయంగా రూపొందించడం గర్వకారణం.

వివరాలు 

200 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో గామా కిరణాలను గుర్తించే సామర్థ్యం  

MACE అబ్జర్వేటరీ అధిక శక్తి గామా రే కిరణాలపై శాస్త్రవేత్తలకు అధ్యయనం చేయడానికి ఉపయోగపడనుంది. కాస్మిక్‌ కిరణాల పరిశోధనలో ఇది భారత్‌ను ముందుకు నడిపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. సూపర్‌ నోవా, బ్లాక్‌ హోల్స్‌, గామా రేలపై లోతైన అవగాహనకు ఈ అబ్జర్వేటరీ దోహదపడుతుంది. ఈ అబ్జర్వేటరీ ప్రారంభానికి ముందే 200 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని గామా కిరణాలను గుర్తించి తన సామర్థ్యాన్ని చాటింది. 21 మీటర్ల వ్యాసం, 175 టన్నుల బరువు, 356 చదరపు మీటర్ల రిఫ్లెక్టర్ ఏరియాతో MACE టెలిస్కోప్‌ అమర్చబడింది.

వివరాలు 

టెలిస్కోప్ ఎలా పనిచేస్తుంది? 

సాధారణంగా గామా కిరణాలు భూమి ఉపరితలానికి చేరవు. భూ వాతావరణం వీటిని అడ్డుకుంటుంది. అయితే వాతావరణంతో పరస్పర చర్య ద్వారా ఇవి అధిక శక్తి కణాలను సృష్టిస్తాయి. ఈ కణాలు పెద్ద వేగంతో ప్రయాణిస్తూ చెరెన్‌కోవ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. అబ్జర్వేటరీలోని మిర్రర్లు, కెమెరాలు ఈ రేడియేషన్‌ను క్యాప్చర్ చేస్తాయి. హాన్లే ప్రాంతమే ఎందుకు ? హాన్లే ప్రాంతం అత్యంత తక్కువ లైట్ పొల్యూషన్ ఉండటం గామా రేలను గుర్తించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో ఒకటైనందున ఇతర ప్రాంతాల కంటే అధికంగా పరిశోధన చేయడానికి అనువుగా ఉంటుంది.

వివరాలు 

శాస్త్రవేత్తలకు స్వర్గం 

గామా కిరణాలపై పరిశోధనలు చేసే ఖగోళ శాస్త్రవేత్తలకు హాన్లే ప్రాంతం స్వర్గంలాంటిదని అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ డా. ఏకే మొహంతి తెలిపారు. ఈ ప్రాంతం చీకటి ఆకాశం, తక్కువ తేమ, వాయు కాలుష్యం లేని గుణాలు కలిగి ఉండడం శాస్త్రవేత్తలకు ఎంతో కీలకమని చెప్పారు.