Page Loader
Ujjwal Nikam: 'సంజయ్ దత్ చెప్పి ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు...' 1993 ముంబై పేలుళ్లపై ఉజ్వల్ నికమ్
'సంజయ్ దత్ చెప్పి ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు...' 1993 ముంబై పేలుళ్లపై ఉజ్వల్ నికమ్

Ujjwal Nikam: 'సంజయ్ దత్ చెప్పి ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు...' 1993 ముంబై పేలుళ్లపై ఉజ్వల్ నికమ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 30 ఏళ్ల క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలచివేసిన పేలుళ్ల కేసు గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam) తాజాగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇటీవలే ఆయన రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1993 ముంబయి బాంబు పేలుళ్ల (Mumbai Blasts) నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 1993లో ఆయుధాలతో నిండి ఉన్న వ్యాన్‌ విషయాన్ని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) అప్పట్లో పోలీసులకు చెప్పి ఉంటే.. ఆ పేలుళ్లు జరగేవి కావని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

వ్యాన్‌లో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే-47 తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు

1993 మార్చి 12న ముంబయిలో వరుసగా భారీ బాంబు పేలుళ్లు జరిగాయని ఉజ్వల్ నికమ్ గుర్తుచేసుకున్నారు. ఆ పేలుళ్లకు కొన్ని రోజులు ముందు అండర్‌వర్ల్డ్ గ్యాంగ్‌లీడర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేం ఓ వ్యాన్‌ను సంజయ్ దత్ నివాసానికి తీసుకొచ్చాడని చెప్పారు. ఆ వ్యాన్‌లో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే-47 తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయన్నారు. వాటిలోని కొంత భాగాన్ని సంజయ్ దత్ తన ఇంట్లో ఉంచుకున్నాడని.. ఒక ఏకే-47 తుపాకిని అతడు వద్ద ఉంచుకొని మిగిలిన ఆయుధాలను తిరిగి అప్పగించాడని తెలిపారు. కానీ సంజయ్ దత్ అప్పట్లో ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే.. వారు విచారణ చేసి పేలుళ్లను అడ్డుకోవడం సాధ్యమయ్యేదని ఉజ్వల్ నికమ్ అభిప్రాయపడ్డారు.

వివరాలు 

సంజయ్ దత్‌పై టాడా చట్టం కింద ఉగ్రవాదానికి సంబంధించి కేసు

తుపాకులపై ఆసక్తితో సంజయ్ దత్ తన వద్ద ఏకే-47 తుపాకిని ఉంచుకున్నా.. దానిని ప్రయోగించలేదని అప్పట్లో నటుడి న్యాయవాది చెప్పిన విషయాన్ని ఉజ్వల్ నికమ్ గుర్తు చేశారు. అయినప్పటికీ సంజయ్ దత్ ఆయుధాల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించి ఉంటే.. ముంబయి బాంబు పేలుళ్లను అడ్డుకునే అవకాశం ఉండేదని నికమ్ తెలిపారు. ఆ సమయంలో సంజయ్ దత్‌పై టాడా చట్టం కింద ఉగ్రవాదానికి సంబంధించి కేసు నమోదైందని.. అయితే కోర్టు ఆయన్ను ఆ అభియోగాల్లో నిర్దోషిగా ప్రకటించినప్పటికీ అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించిందని చెప్పారు. పుణె యరవాడ జైలులో శిక్ష అనుభవించిన సంజయ్ దత్ 2016లో విడుదలయ్యారని వెల్లడించారు.

వివరాలు 

ఉజ్వల్ నికమ్ ఎవరు? 

1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసుతోపాటు టి-సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసు,2008 ముంబయి ఉగ్రదాడుల కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా వాదించిన వ్యక్తి ఉజ్వల్ నికమ్. 2008 ముంబయి దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడేలా న్యాయపరంగా నికమ్‌ కృషి చేశారు. 2013 ముంబయి గ్యాంగ్ రేప్ కేసు, 2016 కోపర్దీ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. తన న్యాయ సేవలకు గాను 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి నికమ్‌ను సత్కరించింది.

వివరాలు 

ఉజ్వల్ నికమ్ ఎవరు? 

2017లో 'ఆదేశ్ - ది పవర్ ఆఫ్ లా' అనే పేరుతో కోర్ట్ రూమ్ డ్రామా రూపంలో నికమ్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రూపొందింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర-మధ్య ముంబయి నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన నికమ్.. కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది.