Yadadri: యాదాద్రి ఆలయ స్వర్ణతాపం ఆకృతి ఖరారు.. త్వరలోనే పనులు ప్రారంభం
యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపనం ఆకృతిని అధికారులు తాజాగా ఖరారు చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి కొండా సురేఖ ఇటీవల సమీక్ష కూడా నిర్వహించారు. ఆకృతి ఖరారైన నేపథ్యంలో త్వరలోనే స్వర్ణతాపనం పనులు ప్రారంభం కానున్నాయి. తొలుత 127 కిలోల బంగారంతో తాపడం చేయాలని నిర్ణయించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది 65 కిలోలకు తగ్గించారు. విరాళాల రూపంలో ఇప్పటివరకు 11 కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదు సేకరించినట్టు సమాచారం. స్వర్ణతాపడం పనులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.
గర్భాలయంలో స్వర్ణకాంతులతో ప్రకాశించే ముఖ మండపం
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అనంతరం ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయానికి బాహ్య ప్రాకారంలో తిరు మాఢవీధులైన తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర పంచతల రాజగోపురాలను సరికొత్తగా నిర్మించారు. ముఖ్యంగా పడమర సప్తతల రాజగోపురంతో పాటు త్రితల విమాన గోపురాలు కృష్ణశిలలతో అద్భుతంగా నిర్మించారు ప్రధాన ఆలయం యాళీ పిల్లర్లు, అష్టభుజి మండపాలతో అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. స్వామివారికి ప్రత్యేక రథశాల నిర్మించిన వైపు, తిరుమల తిరుపతి ఆలయంలా పడమర ప్రాంతంలో వేంచేపు మండపం, తూర్పు వైపు బ్రహ్మోత్సవ మండపం ఏర్పాటు చేశారు. గర్భాలయంలో ఆళ్వారులు, స్వర్ణకాంతులతో ప్రకాశించే ముఖ మండపం నిర్మాణం కూడా చేపట్టారు. ఇది ఆలయానికి మరింత మహిమను జోడించింది.