ఉత్తరాదిలో తగ్గని వరదలు.. తాజ్ మహల్ గోడలను 45 ఏళ్లకు తాకిన యమున
ఉత్తరాదిలో కొద్ది రోజులుగా కుంభవృష్టి కారణంగా యమున ఉగ్రరూపం కొనసాగిస్తోంది. ప్రమాదకర స్థాయికి మించి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు ఆగ్రాలో నీటిమట్టం భారీగా పెరిగి తాజ్ మహల్ గోడలను తాకుతోంది.భారీ వరదలతో స్మారక చిహ్నం వెనుక ఉద్యానవనం మునిగింది. 45 ఏళ్ల తర్వాత తాజ్ ను యమున తాకడం ఇదే తొలిసారి. 1978లో సంభవించిన వరదల్లో తాజ్ ను యమున చుట్టుముట్టింది. 508 అడుగుల ఎత్తులో యమున ప్రవహించడంతో తాజ్ బేస్‌మెంట్‌లోని 22 గదుల్లోకి నీరు చేరింది. తాజా వరదలతో తాజ్ కు ముప్పు లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ ప్రాంతాలన్నీ జలమయం కాగా కైలాస మహాదేవ్ గర్భగుడిలోకి వరద చేరింది.