Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలను దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా పర్వత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో చాలా చోట్ల భారీ వర్షాలు కుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడడం వల్ల అనేక రహదారులు మూసుకుపోయాయి. దేవప్రయాగ్‌లో గంగానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. అలకనంద నదిపై డ్యామ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో హరిద్వార్‌లో హెచ్చరిక స్థాయిని అధిగమించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత కేంద్రాలకు ప్రభుత్వ తరలిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని మొత్తం 13 జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించింది.
యమునా నదిలో మళ్లీ పెరిగిన నీటీమట్టం
దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆదివారం కొంత తగ్గడంతో అందరూ ఊపి పీల్చుకున్నారు. అయితే తాజాగా యమునా నది నీటిమట్టం మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నది సోమవారం ఉదయం 11 గంటలకు 205.76 మీటర్లకు చేరిందని సెంట్రల్ వాటర్ కమిషన్ వర్కర్ తెలిపారు. ఇదిలా ఉంటే, సోమవారం దిల్లీలో రాబోయే 24గంటలు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ ) పేర్కొంది. దీంతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాబోయే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.