Page Loader
ఏపీ:ఆకివీడులో ఘోరం.. ఇంట్లోకి చొరబడి తాత,తల్లిపై దాడి, యువతి అపహరణ 
ఏపీ ఆకివీడులో ఘోరం

ఏపీ:ఆకివీడులో ఘోరం.. ఇంట్లోకి చొరబడి తాత,తల్లిపై దాడి, యువతి అపహరణ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 26, 2023
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు ఓవృద్ధుడు, అతడి కుమార్తెపై దాడి చేశాడు.అంతటితో ఆగకుండా ఓ యువతిని బలవంతంగా లేవదీసుకెళ్లాడు. ఈ ఘోర ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురంలో జరిగింది. గ్రామంలో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు వృద్ధ మహిళ అనారోగ్యం బారిన పడటంతో తణుకులోని ఆస్పత్రికి తరలించారు. ఏలూరులో నివసిస్తున్న వీరి కుమార్తెకు తల్లికి అనారోగ్యం ఉందనే విషయం తెలిసింది. దీంతో తన 20 ఏళ్ల కూతురును వెంటబెట్టుకుని పుట్టింటికి (సిద్ధాపురం) వచ్చింది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్‌కు ఆ యువతి గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో ఇమ్రాన్‌ సదరు యువతి వెంట పడినట్లు సమాచారం.

DETAILS

హత్యాయత్నం కింద కేసు నమోదు

మంగళవారం తెల్లవారుజామున యువతి కోసం ఆమె అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆరు బయట నిద్రిస్తున్న ఆమె తాత తలపై ఇనుపరాడ్డుతో బలంగా మోదాడు. దీంతో నిద్రలేచిన పెద్దాయన కేకలు పెట్టాడు. బాధితుడి అరుపులతో ఏం జరిగిందోనని బయటకు వచ్చిన అతడి కుమార్తెపైనా దాడికి దిగాడు. తన వెంట రాకపోతే ఆమె తాతను, తల్లిని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. ఈ మేరకు యువతిని తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు.తీవ్రంగా గాయపడిన వృద్ధుడు, ఆమె కుమార్తె భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధుడి తలకు 50 కుట్లు పడ్డాయని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.