Page Loader
Ys Jagan: పథకాలను ఆపేందుకు ఢిల్లీ నేతలతో చంద్రబాబు కుట్ర.. వైఎస్ జగన్ ఆరోపణలు
పథకాలను ఆపేందుకు ఢిల్లీ నేతలతో చంద్రబాబు కుట్ర.. వైఎస్ జగన్ ఆరోపణలు

Ys Jagan: పథకాలను ఆపేందుకు ఢిల్లీ నేతలతో చంద్రబాబు కుట్ర.. వైఎస్ జగన్ ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2024
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నేతలతో కలిసి కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా మహిళా లబ్ధిదారులకు అందాల్సిన నిధులను అడ్డుకోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసినా వైఎస్సార్‌సీపీ విజయం తప్పదని జగన్‌ ప్రకటించారు. జూన్ 4 తర్వాత ఆగిపోయిన పథకాల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. 2019లో అవినీతి వలయం నుంచి విముక్తి పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐక్యంగా నిలిచారని సీఎం ఉద్ఘాటించారు. మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చలేదన్నారు.

Details 

సైకిల్‌ రిపేర్‌ కోసం మెకానిక్‌లు 

అందుకు ప్రతీకారంగానే 2019లో ప్రజలంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారన్నారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌ కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు.ఆ రిపేర్‌ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లినా ఫలితం రాలేదు. అందుకే దత్తపుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టిన సైకిల్ క్యారేజీ మీద ఎక్కి టీగ్లాస్‌ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అనడంతో.. బాబు తన వదినమ్మను ఢిల్లీకి పంపించి సైకిల్‌ రిపేర్‌ కోసం మెకానిక్‌లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి రిపేర్ చేయటానికి ప్రయత్నిస్తే ఆసైకిల్ కు హ్యాండిల్ లేదు,పెడల్స్ లేదు,సీటు లేదు, చక్రాలు లేవు,ట్యూబ్‌ కూడా లేదు..ఇంత తుప్పు పట్టిన సైకిల్ ను ఎలా నడుపుతావని అడిగారని సెటైర్లు వేశారు.

Details 

ఢిల్లీ పెద్దలతో కలిసి టీడీపీ కుట్రలు 

అయితే, సైకిల్ తుప్పు పట్టినా.. బెల్ ఒక్కటే మిగిలిందని ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగించాడు. ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో. అధికారంలోకి వచ్చే వరకు అబద్ధాలు,మాయలు,మోసాలే చేస్తారంటూ ఆరోపణలు గుప్పించారు జగన్‌. మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం,ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ-ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. గత 59నెలలుగా,తమ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్‌ను రూపొందించిందని,ప్రతి నెలా పథకాల పంపిణీని వివరించామని,దీనివల్ల హామీలు సకాలంలో నెరవేరుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. జూన్‌ 4న వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి వారం రోజుల్లోగా అన్ని పథకాల పంపిణీని వేగవంతం చేస్తామని జగన్‌ చెప్పారు.