
YS Jagan: 2027లో నేను మళ్లీ పాదయాత్ర చేస్తా.. పార్టీ నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్
ఈ వార్తాకథనం ఏంటి
కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2027లో తాను మరోసారి పాదయాత్ర చేపట్టబోతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ సమావేశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
అదే ప్లీనరీలో తన పాదయాత్ర ప్రకటనతో పాటు పార్టీ రాజకీయ వ్యూహాలను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పర్యవేక్షకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వివరాలు
ఎమ్మెల్యేలను గెలిపిస్తే సముచిత స్థానం
"మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎంతమంది పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారనేది మీకు నా పరీక్ష.
మీరు ఎంతగా మద్దతు సమకూర్చగలిగితే, మీకు అంతటి స్థానం ఉంటుంది. ఇదే విధానం ప్రాంతీయ సమన్వయకర్తలకూ వర్తిస్తుంది.
నియోజకవర్గంలో పార్టీ నేతలకు ఎమ్మెల్యే అభ్యర్థితో ఏవైనా భేదాభిప్రాయాలుంటే,వాటిని పరిష్కరించే బాధ్యత మీదే," అని జగన్ స్పష్టం చేశారు.
వివరాలు
చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారు
"2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసగించారు.అదే సమయంలో నేను పాదయాత్ర చేసి ప్రజల్లో నమ్మకాన్ని నెలకొల్పాను.ఆ భరోసా వల్లే ప్రజలు 2019 ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించారు.ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.చంద్రబాబు మళ్లీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు.ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అందుకే 2027లో మళ్లీ నేను పాదయాత్రకు సిద్ధమవుతున్నా," అని జగన్ వివరించారు.
వివరాలు
మన ప్రాధాన్యాలకు అనుగుణంగానే 2.0
"చంద్రబాబు నాయుడు ఈ 11 నెలల పాలన చూశాక, నా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... కార్యకర్తలు కూడా మళ్లీ నా నుంచే నిష్కళంక రాజకీయాలు ఆశిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాలను చూసి నాలోనూ స్పష్టమైన మార్పు వచ్చింది. జగన్ 2.0లో మన కార్యకర్తలకే ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మన ప్రాధాన్యాలు ఏంటో నాకు పూర్తిగా తెలుసు. అందుకే జగన్ 2.0 పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని స్పష్టంగా చెబుతున్నా," అని చెప్పారు.
వివరాలు
బూత్ కమిటీల ద్వారా 18 లక్షల మంది సభ్యులు
రాష్ట్రవ్యాప్తంగా బూత్ కమిటీల నియామకం పూర్తయ్యాక, పార్టీ సంస్థాగత బాధ్యతల్లో సుమారు 18 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు భాగమవుతారని జగన్ తెలిపారు.
వారికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు బీమా సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు.
అక్టోబరు తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.