
Duvvada Srinivas: వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో,ఆయనను పార్టీ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని క్రమశిక్షణా కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రకటన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైంది.
ఈ సందర్భంలో పార్టీలో కొన్ని కీలక నియామకాలు కూడా జరిగాయి. అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్‌ను, విశాఖపట్టణం జిల్లా అధ్యక్షుడిగా కె.కె. రాజును వైఎస్ జగన్ నియమించారు.
వివరాలు
వివిధ వివాదాల్లో దువ్వాడ శ్రీనివాస్
ఇక దువ్వాడ శ్రీనివాస్ గత కొన్ని నెలలుగా వివిధ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
మొదట ఆయన భార్యతో ఏర్పడిన గృహ కలహాల నేపథ్యంలో మీడియా ఫోకస్ అయ్యారు.
ఆపై దివ్వెల మాధురి వ్యవహారంతో ఆయన పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో తిరుమలకు ఆమెతో కలిసి వెళ్లిన ఫోటోలు, అనంతరం నమోదైన కేసులు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
అంతేకాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలతో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో దువ్వాడ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
ఆ తర్వాతి దశలో,యూజీసీకి గుర్తింపు లేని విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందినట్లు సమాచారం బయటకు రావడంతో,సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం చేసిన ట్వీట్
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. pic.twitter.com/kjFfWhSPCI
— YSR Congress Party (@YSRCParty) April 22, 2025
వివరాలు
మశిక్షణా ఉల్లంఘనల నేపథ్యంలో.. పూర్తిగా సస్పెండ్
ఇంతలోనే, విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు ఆయన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
దానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఫోన్ కాల్, అందులో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక గతంలో కుటుంబ సమస్యల నేపథ్యంలో, ఆయనను టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జి బాధ్యతల నుంచి తొలగించి, ఆ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు క్రమశిక్షణా ఉల్లంఘనల నేపథ్యంలో పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు.