
Y.S.Jagan: పోలీసు శాఖపై వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు..రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పోలీసులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి.
''తప్పు చేసిన పోలీసుల బట్టలూడదీస్తాం'' అంటూ పదేపదే ఆయన చేసిన వ్యాఖ్యలు వివిధ వర్గాల్లో తీవ్ర ప్రతిచర్యకు కారణమయ్యాయి.
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో జరిగిన సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలతో పాటు రామగిరి ఎస్‌ఐ సుధాకర్ కూడా తీవ్రంగా స్పందించారు.
అయితే వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం జగన్ వ్యాఖ్యల ఉద్దేశం తప్పు చేసిన పోలీసులపైనే అని అంటున్నారు.
వివరాలు
ఇది కొత్తేమీ కాదు - ఇతర పార్టీల నేతలు కూడా అంతే
ఇలాంటివి కొత్తవి కావు.గతంలో టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా పోలీసులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
రాజకీయ నాయకులు పోలీసులను తప్పుబట్టిన సందర్భాలు రాష్ట్ర చరిత్రలో పలుమార్లు నమోదయ్యాయి.
పోలీసులపై ఇలా మాట్లాడటం చెల్లుతుందా?
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఓ ప్రజాప్రతినిధికి తగినదేనా?పోలీసులు దీనిపై బహిరంగంగా స్పందించడం ఎంతవరకు సరైనది?అనే ప్రశ్నలు ఇప్పుడు సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.
జగన్ స్పష్టమైన హెచ్చరికలు - ఏమన్నారంటే
రామగిరిలో మాట్లాడిన జగన్,''తప్పు చేసిన ఖాకీల యూనిఫాం తీయిస్తాం.అలాంటి పోలీసుల బట్టలు ఊడదీస్తాం.మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని వదలిపెట్టం.చట్టం ముందు నిలబెట్టి, వారు చేసిన ప్రతిదానికీ వడ్డీతో సహా లెక్క తీర్చిస్తాం.ఉద్యోగాలు లేకుండా చేస్తాం''అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
వివరాలు
లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్యలు రామగిరి పర్యటనలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య హత్య జరిగిన తర్వాత, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన తరువాత జరగాయి. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎంపీపీ ఎన్నికల్లో పోలీసుల పాత్రపై ఆరోపణలు
జగన్ తన పర్యటనలో మాట్లాడుతూ, ఎంపీపీ ఎన్నికల సమయంలో వైసీపీ ఎంపీటీసీలను ఎస్‌ఐ సుధాకర్ అడ్డగించారని, అదే సమయంలో లింగమయ్యను ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపించారు.
ఫిర్యాదు రాయడం, దాని మీద బాధితుడి భార్య చేత సంతకం చేయించడం అన్నీ పోలీసుల స్వేచ్ఛా చర్యలేనని అన్నారు.
వివరాలు
గతంలోనూ జగన్ విమర్శలు
ఇలాంటి వ్యాఖ్యలు జగన్ నుండి ఇదే మొదటి సారి కాదు. విజయవాడ జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం కూడా ఆయన ఇదే తరహాలో ''పోలీసుల బట్టలూడదీస్తాం'' అని హెచ్చరించారు.
కడప పర్యటనలో..డీఎస్పీపై జగన్ వ్యాఖ్యలు
వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించినప్పుడు, ఒక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు పవన్ కుమార్ తనపై డీఎస్పీ వేధింపుల గురించి జగన్‌కు చెప్పారు. దానికి స్పందించిన జగన్, ''బాధపడకురా.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని చేత సెల్యూట్ చేయిస్తా'' అని హామీ ఇచ్చారు.
వివరాలు
ఎస్‌ఐ సుధాకర్ బహిరంగంగా స్పందన
జగన్ చేసిన వ్యాఖ్యలపై రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ బహిరంగంగా ఖండించారు. ''పోలీసు యూనిఫాం అరటి తొక్క కాదు. జాగ్రత్తగా మాట్లాడండి'' అంటూ ఆయన స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.
మాజీ సీఎం అయినా సరే - వ్యవహారం తగినదేనా?
''మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఎవరి మనోభావాలనైనా నొప్పించేలా మాట్లాడతారా?'' అని ఆయన ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం కలిగిందన్నారు.
వివరాలు
ఎస్ఐకి వాక్ స్వాతంత్ర్య హక్కు ఉందా?
ప్రముఖ మీడియాతో మాట్లాడిన సుధాకర్, ''రాజ్యాంగం మాకూ వాక్ స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. అకారణంగా నిందలు వేస్తే మేమేం ఎందుకు సహించాలి?'' అంటూ ప్రశ్నించారు.
ఎంపీపీ ఎన్నికల్లో తమపై చేసిన దుష్ప్రచారాన్ని గుర్తుచేశారు.
తాను లోకేష్ సహా మంత్రులతో దిగిన ఫోటోల ఆధారంగా, తాను టీడీపీ సానుభూతిపరుడని ముద్రవేస్తూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేస్తోందని ఎస్ఐ సుధాకర్ వాపోయారు.
''నాతో పాటు మరో 60 మంది పోలీస్ అధికారులు 16 ఏళ్లుగా పదోన్నతికి ఎదురు చూస్తున్నాం. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నపుడే నేతలను కలిశాం. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న మాకు ఇటువంటి ముద్రలు వేయడం సరికాదు'' అని ఆయన చెప్పారు.
వివరాలు
టీడీపీ నేతల విమర్శలు గుర్తుచేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, జగన్ విమర్శలు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయో స్పష్టంగా ఉందన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ , కింజరాపు అచ్చెన్నాయుడు కూడా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మా నాయకులు ఎప్పుడూ హద్దులు దాటలేదు: టీడీపీ
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ నేతలు ఎప్పుడూ ఇలాంటివి మాట్లాడలేదన్నారు. ''పోలీసులు వ్యతిరేకంగా ఉన్నా, మా నాయకులు శాంతంగా వ్యవహరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే అనేవాళ్లు, ఇలా బట్టలూడదీస్తామంటూ మాట్లాడరన్నారు.''
వివరాలు
ఎస్‌ఐ వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ స్పందన
రామగిరి ఎస్‌ఐ చేసిన వ్యాఖ్యలకు తమకు ఎటువంటి సంబంధం లేదని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు.
పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హుస్సేన్, అసోసియేట్ ప్రెసిడెంట్ హరి మాట్లాడుతూ, సుధాకర్ వ్యాఖ్యల్లో తప్పేం లేదన్నారు.
''పోలీసుల మీద నిత్యం విమర్శలు చేయడం సరికాదు. మేమూ మనుషులమే. ప్పటికైనా పోలీసుల జోలికి రావొద్దు'' అని వారు సూచించారు.
పోలీసు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే, న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
వివరాలు
ఒక ఎస్‌ఐ ఇలా బహిరంగంగా మాట్లాడొచ్చా?
ఇలాంటి సందర్భాల్లో పోలీస్ అధికారులకు స్పందించేందుకు అనుమతి అవసరమా అనే ప్రశ్నపై మాజీ ఐజీ ఇక్బాల్ స్పందించారు.
''పోలీసు మ్యాన్యువల్‌లో దీని గురించి స్పష్టత లేదు. కానీ వ్యక్తిగతంగా విమర్శలు జరిగితే ఓపిక కోల్పోవడం సహజమే'' అన్నారు.
విమర్శలు సరే.. కానీ హద్దులు ఉండాలి
రాజకీయ విశ్లేషకుడు డానీ మాట్లాడుతూ, ''రాజకీయ నేతల విమర్శలు ఒక వరకు బాగున్నా, వ్యక్తిగత విమర్శలు, హద్దు దాటి మాట్లాడటం శ్రేయస్కరం కాదు. ఇటువంటి విమర్శల ధోరణి వ్యవస్థలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది'' అన్నారు.
వివరాలు
పోలీసు మ్యాన్యువల్‌లో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ పోలీసు మ్యాన్యువల్‌లో రాజకీయ విమర్శలపై స్పందించాలా లేదా అనే అంశంపై స్పష్టత లేదు.
అయితే, 87వ పేజీలో ''మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. వాదనకు పోవద్దు'' అనే సూచన ఉంది. అంటే, పోలీసులు సంయమనంతో వ్యవహరించాలన్నదే మార్గదర్శకం.