Page Loader
YS Jagan: నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్‌ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి 
నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్‌ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి

YS Jagan: నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్‌ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీవారి దర్శనం కోసం అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్‌ను మాజీ సీఎం వై.ఎస్.జగన్ వద్ద కూడా తీసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు. ముందుగానే అతిథిగృహం వద్ద ఆయనకు డిక్లరేషన్‌ ఫారాన్ని అందించి, సంతకం తీసుకోవాలని యోచిస్తున్నారు. జగన్‌ సంతకం చేస్తే దర్శనానికి అనుమతి ఇస్తారు, లేకపోతే దేవాదాయశాఖ చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. అంటే, డిక్లరేషన్‌ పై సంతకం లేకపోతే దర్శనం అనుమతించబోరని స్పష్టమవుతోంది.

వివరాలు 

అప్పటి ప్రభుత్వం,టీటీడీ  ఛైర్మన్లు,ఈవో పై భక్తులు తీవ్ర విమర్శలు

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఆరోపణలతో పెద్ద దుమారం చెలరేగింది. అప్పటి ప్రభుత్వం, టీటీడీ ఛైర్మన్లు వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి దర్శనానికి రావడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అన్యమతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్‌మెంటు వద్ద డిక్లరేషన్‌పై సంతకం చేయించుకుంటారు. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే అతిథిగృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్‌కు కూడా ఈ విధానాన్ని పాటిస్తారు.

వివరాలు 

అధికారంలో ఉండగా పాటించలేదు 

వైసీపీ పాలనలో ఉన్నప్పుడు జగన్‌ శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్‌ అవసరం లేకపోయింది. హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్‌ చేసినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు, డిక్లరేషన్‌పై సంతకం చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతించాలని టీటీడీ అధికారులకు సూచనలు అందాయి. మరోవైపు, బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని చెప్పారు. జగన్‌ ఆలయ దర్శనానికి ముందు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వివరాలు 

ఏమిటీ డిక్లరేషన్‌? 

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిబంధనల ప్రకారం, అన్యమతస్థులు శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు తప్పనిసరిగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయశాఖ చట్టం 30/1987కు అనుగుణంగా, 1990లో అప్పటి ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును (జీఓ) జారీ చేసింది. ఆ జీఓ ప్రకారం, హిందువు కాని వ్యక్తులు లేదా అన్యమతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్‌ ఫారంపై సంతకం చేయాలి. తమది వేరే మతమని, అయినా శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున దర్శనం కోసం అనుమతి కోరుతూ, సంతకం చేసి వివరాలు నమోదు చేయాలి.